ఇంగ్లండ్‌ను పడగొట్టగలదా?

14 Jun, 2017 16:02 IST|Sakshi
ఇంగ్లండ్‌ను పడగొట్టగలదా?

- చాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీస్‌.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్‌

కార్డిఫ్‌: ఇటీవల 300 పరుగుల్ని అవలీలగా చేస్తున్న జట్టు ఒకవైపు... పడుతూ లేస్తూ సెమీస్‌ చేరిన జట్టు మరోవైపు... చాంపియన్స్‌ ట్రోఫీలో టైటిల్‌ వేటకు తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి సెమీఫైనల్లో టాస్‌ నెగ్గిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ‘సంచలనం’ అనేది మమ్మల్ని గెలిపిస్తుందనే ధైర్యంతో సర్ఫరాజ్‌ సేన బరిలోకి దిగుతోంది. అయితే ఈ టోర్నీలో అజేయంగా సాగుతున్న ఏకైక జట్టు ఇంగ్లండ్‌ను ఎదిరించాలంటే పాక్‌ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.

మోర్గాన్‌ సేన తహతహ...
వన్డే క్రికెట్లో ఓ మేజర్‌ ట్రోఫీ వెలతి ఇంగ్లండ్‌ను వెక్కిరిస్తోంది. మూడు సార్లు ప్రపంచకప్‌ ఫైనలిస్టుగానే తృప్తి పడిన ఈ జట్టు గత 42 ఏళ్లలో ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోయింది. 2015 వన్డే ప్రపంచకప్‌లో లీగ్‌ దశ పరాభవంతో కళ్లు తెరిచిన ఇంగ్లండ్‌ జట్టు ఏడాది తిరిగేలోపే దుర్బేధ్యమైన జట్టుగా మారింది. వ్యక్తిగతంగా చూస్తే బెన్‌ స్టోక్స్‌ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. బ్యాట్‌తోనైనా, బాల్‌తోనైనా మ్యాచ్‌ స్థితిని ఒంటిచేత్తో మార్చేయగలడు. బ్యాటింగ్‌లో అలెక్స్‌ హేల్స్, జో రూట్, జోస్‌ బట్లర్‌లతో కూడిన టాప్‌ ఆర్డర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది.  బౌలింగ్‌ విభాగంలో జేక్‌ బాల్, ప్లంకెట్‌ నిప్పులు చెరుగుతున్నారు. అందుకే ఈ టోర్నీలో గ్రూప్‌ దశలో అన్ని మ్యాచ్‌ల్ని గెలిచిన ఒకే ఒక జట్టుగా నిలువగలిగింది.

నిలకడలేమితో పాక్‌...
ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌తో పోల్చినా... బౌలింగ్‌తో సరిచూసినా... పాక్‌ ఎంతో దూరంలో ఉంది. బ్యాట్స్‌మెన్‌ ఎప్పుడెలా ఆడతారో... బ్యాటింగ్‌లో ఎందుకలా పెవిలియన్‌కు క్యూకడతారో వారికే తెలియని పరిస్థితి. గత మ్యాచ్‌లో శ్రీలంకను దాటింది కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే! అది కూడా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ పుణ్యమాని గట్టెక్కింది. జట్టులో ఎంతో అనుభవజ్ఞుడైన షోయబ్‌ మాలిక్‌ కూడా నిలువలేని చోట అతను చూపించిన తెగువని ప్రశంసించాల్సిందే. కానీ ప్రతీసారి ఈ మ్యాజిక్‌ పనిచేయదనే సంగతి గుర్తుంచుకోవాలి.

ఓ అసాధారణ జట్టును ఢీకొనాలంటే అందరూ వందశాతం అంకితభావాన్ని కనబరచాలి. టాప్‌ ఆర్డర్‌లో అజహర్, ఆజమ్‌... మిడిలార్డర్‌లో హఫీజ్, మాలిక్‌ ఇలా అందరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయాలి. బౌలింగ్‌ను పరిశీలిస్తే పేసర్లు ఆమిర్, జునైద్, హసన్‌ అలీలు మెరుగ్గా బౌలింగ్‌ చేస్తున్నారు.  పిచ్‌: ఇక్కడి సోఫియా గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పాక్, శ్రీలంకల మధ్య జరిగిన పిచ్‌నే తొలి సెమీస్‌కు వినియోగిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు లేదు. గత వారమంతా వర్షంతో ఇబ్బంది పడినా... ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో ‘డక్‌వర్త్‌’ను పక్కనబెట్టి ప్రేక్షకులు 100 ఓవర్లు చూసేయొచ్చు.

>
మరిన్ని వార్తలు