భవిష్యత్తు ఆ ముగ్గురిదే!

16 Oct, 2018 00:27 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌   

ఆసక్తికర ఆరంభమే లభించినా... రెండో టెస్టు మ్యాచ్‌ కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయి భారత్‌కు మరో సిరీస్‌ను అందించింది. ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచపు రారాజులుగా వెలిగిన జట్టు ఇంత అధమ స్థాయికి దిగజారడం క్రికెట్‌ అభిమానులను కలతకు గురి చేస్తున్నా... నాడు వారి చేతుల్లో ఇదే తరహాలో చావుదెబ్బ తిన్న మాకు మాత్రం ఈతరం యువ భారత క్రికెటర్లు ఆడుతున్న అద్భుత ఆట చూస్తే సంతృప్తి కలుగుతుంది.   వెస్టిండీస్‌ అగ్రశ్రేణి క్రికెటర్లు కొందరు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు బాగా వచ్చే టి20 లీగ్‌లు ఆడటానికే ఆసక్తి కనబరుస్తుండటంతో విండీస్‌ బాగా బలహీనంగా మారిందనేది వాస్తవం. గత పదేళ్లుగా ఆ జట్టు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగడం అరుదుగా మారింది. కరీబియన్‌ దీవులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి కానీ అక్కడ బతుకుదెరువు కోసం ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. కాబట్టి టెస్టు మ్యాచ్‌లు ఆడటంకంటే టి20 లీగ్‌లతో తమ భవిష్యత్తును భద్రం చేసుకోవాలని వారు భావించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.   ఆ జట్టులో అత్యుత్తమ బౌలర్లు లేకపోవడం అనూహ్యమేమీ కాదు కానీ మరీ ప్రమాదకరంగా ఏమీ లేని పిచ్‌లపై కూడా జట్టు బ్యాట్స్‌మన్‌ ఆడుతున్న తీరు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. కనీసం బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కూడా మార్చకుండా, ఒకే తరహా మూసలో ఆడటం వల్ల వారికి మరింత నష్టం జరిగింది. ఛేజ్, హోల్డర్‌ ఇద్దరూ ప్రస్తుతం తాము ఆడుతున్న స్థానాలకంటే మరింత పైన బ్యాటింగ్‌కు రావాల్సింది.  

భారత్‌కు మరో సిరీస్‌ విజయం పూర్తిగా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా ముగ్గురు యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం జట్టుకు అదనపు బలంగా మారింది. మరిన్ని పరుగులు సాధించే తపన పృథ్వీ షాలో కనిపించగా... అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లో రిషభ్‌ పంత్‌ ఆకట్టుకున్నాడు. తన లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై పట్టు సాధించిన కుల్దీప్‌ యాదవ్‌ కూడా తొలిసారి ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. ఈ ముగ్గురిని భారత భవిష్యత్తుగా చెప్పవచ్చు. చాలా మందిలాగే కెరీర్‌లో మున్ముందు ఎత్తుపల్లాలు వచ్చే అవకాశం ఉన్నా వీరిలో పోరాట తత్వం ఉండటం వల్ల పరుగులు సాధించగలరు, వికెట్లు పడగొట్టగలరు. టెస్టులో పది వికెట్లు సాధించిన ఉమేశ్‌ యాదవ్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసేటప్పుడు బంతిని అతను అద్భుతంగా రివర్స్‌ స్వింగ్‌ చేస్తూ ప్యాడ్, బ్యాట్‌ మధ్యలోంచి దూసుకుపోయేలా చేశాడు. కొత్త బంతిని అద్భుతంగా ఉపయోగించగల బౌలింగ్‌ దళం ఇప్పుడు భారత్‌ వద్ద ఉంది. టెస్టు సిరీస్‌ను భారత్‌ అతి సునాయాసంగా గెలుచుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పై నిలిచింది. 

మరిన్ని వార్తలు