రన్నరప్‌ శాట్స్‌ సీమర్స్‌

17 Feb, 2019 09:10 IST|Sakshi

ఆదిలాబాద్‌ ఆరోస్‌కు టైటిల్‌

తెలంగాణ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శాట్స్‌ సీమర్స్‌ జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో శాట్స్‌ సీమర్స్‌ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం టైటిల్‌ పోరులో ఆదిలాబాద్‌ ఆరోస్‌ 36 పరుగుల తేడాతో శాట్స్‌ సీమర్స్‌పై నెగ్గి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆదిలాబాద్‌ ఆరోస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. చరణ్‌ (48 బంతుల్లో 65 నాటౌట్‌; 8 ఫోర్లు) దూకుడైన అర్ధసెంచరీతో చెలరేగాడు. అన్వేష్‌ (24 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కన్నా (30 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఫిర్దౌస్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 137 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శాట్స్‌ సీమర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులే చేసి ఓటమి పాలైంది. 

రిజ్వాన్‌ (15 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), దిలీప్‌ (13 నాటౌట్‌) మినహా మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఆదిలాబాద్‌ ఆరోస్‌ బౌలర్లలో మల్లారెడ్డి 13 పరుగులిచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఉజ్వల్‌ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన చరణ్‌ తేజ (ఆదిలాబాద్‌ ఆరోస్‌) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకోగా... షోయబ్‌ (శాట్స్‌ సీమర్స్‌) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచాడు. ఫైనల్‌ అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆబిద్‌ అలీ, తెలంగాణ క్రికెట్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు