పోరాడి ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జంట

10 Nov, 2019 01:56 IST|Sakshi

  చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఫుజౌ (చైనా): ప్రతి పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ... భారత యువ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంటకు ఓటమి తప్పలేదు. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ద్వయం పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 16–21, 20–22తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జంట కెవిన్‌ సంజయ సుకముల్జో–మార్కస్‌ గిడియోన్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సాత్విక్‌–చిరాగ్‌ జంటకు 9,800 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షలు)తోపాటు 7,700 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ ఆరంభంలోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అయితే ఇండోనేసియా ద్వయం నెమ్మదిగా తేరుకొని వరుస పాయింట్లు సాధించి విరామానికి 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత అదే ఊపులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. కీలకదశలో అనుభవజ్ఞులైన కెవిన్‌–గిడియోన్‌ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.  ఓవరాల్‌గా కెవిన్‌–గిడియోన్‌  చేతిలో భారత జంటకిది వరుసగా ఎనిమిదో ఓటమికాగా... ఈ ఏడాది మూడోది. ఆగస్టులో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ నెగ్గిన సాత్విక్‌–చిరాగ్‌... గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు