మళ్లీ సంచలనం

9 Nov, 2019 04:59 IST|Sakshi

ఈసారి 2018 ప్రపంచ చాంపియన్, మూడో ర్యాంక్‌ జోడీపై నెగ్గిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట

చైనా ఓపెన్‌ టోర్నీలో సెమీస్‌కు చేరిక

నేడు ప్రపంచ నంబర్‌వన్‌ జోడీతో ‘ఢీ’

ఇన్నాళ్లూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్‌ తరఫున సింగిల్స్‌ విభాగాల్లోనే గొప్ప ఫలితాలు కనిపించేవి. అయితే సింగిల్స్‌ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డబుల్స్‌ విభాగంలో అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ లో రన్నరప్‌గా నిలిచే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్స్‌ జోడీని ఓడించిన ఈ భారత జంట తాజాగా 2018 ప్రపంచ చాంపియన్స్‌ జంటను మట్టికరిపించి మరో సంచలనం సృష్టించింది.

ఫుజౌ (చైనా): భారత సింగిల్స్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటలేకపోయిన నిరాశను మరిపిస్తూ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–15తో 2018 ప్రపంచ చాంపియన్స్, మూడో ర్యాంక్‌ జోడీ లీ జున్‌ హుయ్‌–లియు యు చెన్‌ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ సాధికారిక ఆటను ప్రదర్శించారు. రెండు గేముల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

తొలి గేమ్‌లో 15–11తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జోడీకి ఆ తర్వాత గట్టిపోటీ ఎదురైంది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న చైనా జంట 18–18తో స్కోరును సమం చేసింది. అయితే సాత్విక్‌–చిరాగ్‌ ఈ కీలకదశలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి 20–18తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మరో పాయింట్‌ కోల్పోయినా... వెంటనే మరో పాయింట్‌ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జంటకు ఆరంభంలో ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 12–12 వద్ద భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ద్వయం కెవిన్‌ సంజయ సుకముల్జో–మార్కస్‌ గిడియోన్‌ (ఇండోనేసియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–7తో వెనుకంజలో ఉంది.

>
మరిన్ని వార్తలు