రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ జంట 

29 Oct, 2019 03:50 IST|Sakshi
తమ డబుల్స్‌ కోచ్‌ ఫ్లాండీ లింపేలేతో సాత్విక్, చిరాగ్‌ శెట్టి  

ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ చేతిలో ఓటమి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

పారిస్‌: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న జోడీలను బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి తుది మెట్టుపై పోరాడి ఓడింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సాత్విక్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) జంట రన్నరప్‌గా నిలిచింది. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌ టూర్‌–750 స్థాయి టోర్నీ ఫైనల్‌ ఆడిన భారత జంట 18–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జోడీ మార్కస్‌ ఫెర్నాల్డి గిడియోన్‌–కెవిన్‌ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. సాత్విక్‌–చిరాగ్‌ జంటకు 26,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 55 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 121 వారాల నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న గిడియోన్‌–కెవిన్‌ జోడీ చేతిలో సాత్విక్‌–చిరాగ్‌లకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఆగస్టులో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సాత్విక్‌–చిరాగ్‌లు ఈసారి ఫైనల్లో ఒత్తిడికి లోనయ్యారు.

రెండు గేముల్లోనూ భారత జంట ప్రతి పాయింట్‌ కోసం తీవ్రంగా పోరాడింది. తొలి గేమ్‌లో 17–17తో స్కోరును కూడా సమం చేసింది. కానీ కీలకదశలో అనుభవజ్ఞులైన ఇండోనేసియా జంట పైచేయి సాధించింది. రెండో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగింది. మూడుసార్లు 6–6, 8–8, 11–11తో స్కోరు సమమైంది. ఈ గేమ్‌లోనూ కీలకదశలో ఇండోనేసియా జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని అందుకుంది. ఒకవేళ సాత్విక్‌–చిరాగ్‌ గెలిచుంటే 1983లో పార్థో గంగూలీ–విక్రమ్‌ సింగ్‌ బిష్త్‌ తర్వాత ఈ టైటిల్‌ నెగ్గిన భారత జంటగా గుర్తింపు పొందేది. గతంలో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (2017), మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2012) విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ జంట ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్స్‌ మొహమ్మద్‌ హసన్‌–సెతియావాన్‌ (ఇండోనేసియా)లను, క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్స్‌ కిమ్‌ అస్‌ట్రప్‌–ఆండెర్స్‌ రస్‌ముసేన్‌ (డెన్మార్క్‌)లను, సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్స్‌ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్‌)లను ఓడించింది.

ఫైనల్లో మేము రెండు గేమ్‌లనూ నెమ్మదిగా ప్రారంభించాం. ఆరంభంలోనే ఆధిక్యాన్ని సమర్పించుకున్నాం. ఆ తర్వాత కోలుకొని స్కోరును సమం చేసినా కీలకదశలో తప్పిదాలు చేశాం. ఈ టోర్నీలో మా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాం. మా కెరీర్‌లో ఇది రెండో గొప్ప ప్రదర్శనగా చెబుతాం. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌ మా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.
–సాత్విక్, చిరాగ్‌ శెట్టి

మరిన్ని వార్తలు