ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ జోడి

4 Aug, 2019 05:22 IST|Sakshi

సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన తొలి భారత ద్వయంగా గుర్తింపు

నేడు చైనా జంటతో తుదిపోరు  

బ్యాంకాక్‌: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్‌ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్‌ జోడి  మరో అడుగు దూరంలో నిలిచింది.

శనివారం జరిగిన థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీస్‌ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్‌ సాయిరాజ్‌ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్‌ కో సుంగ్‌ హ్యూన్‌ – షిన్‌ బేక్‌ చియోల్‌ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్‌ జంట టైటిల్‌ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది.  

మరిన్ని వార్తలు