ఆగ్రహమా?... ‘అనురాగ’మా!

2 Jan, 2017 00:08 IST|Sakshi
ఆగ్రహమా?... ‘అనురాగ’మా!

నేడు తేలనున్న అనురాగ్‌ ఠాకూర్, బీసీసీఐ భవిష్యత్‌
లోధా ప్యానెల్‌ సంస్కరణల అమలుపై తుది తీర్పు  


న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), లోధా ప్యానెల్‌ మధ్య జరుగుతున్న కేసు విచారణలో నేడు (సోమవారం) సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది. అలాగే కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు చీఫ్‌ అనురాగ్‌ ఠాకూర్‌ విషయంలోనూ కోర్టు ఏం చెబుతుందనేది వేచిచూడాల్సిందే. బీసీసీఐలో ‘కాగ్‌’ నియామకంపై అయిష్టంగా ఉన్న ఠాకూర్‌.. దీన్ని ప్రభుత్వ జోక్యంగా భావిస్తూ లేఖ రాయాలని ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌కు గతంలో లేఖ రాశారు.

అయితే కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో ఠాకూర్‌ ఈ విషయాన్ని పేర్కొనలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసత్య ప్రమాణం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే కేసు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని ఘాటుగా బదులిచ్చింది. అంతేకాకుండా వారం రోజుల్లో మరో అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ప్రస్తుతమున్న పాలక వర్గం లోధా ప్యానెల్‌ ప్రతిపాదనలను అమలు చేయడం లేదు కాబట్టి వీరి స్థానంలో సమర్థులైన ముగ్గురి పేర్లను సూచించాల్సిందిగా బీసీసీఐని కోరింది. మరోవైపు లోధా ప్యానెల్‌ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర క్రికెట్‌ సంఘాలను ఒత్తిడి చేయలేమని బీసీసీఐ తమ అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ మంగళవారమే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుది తీర్పు ఇస్తారా? మరోసారి వాయిదాకు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు