రహానే ఇంకా సెంచరీ కాలేదబ్బా!

28 Oct, 2018 17:52 IST|Sakshi
అజింక్యా రహానే

97 పరుగులకే సెంచరీ సంబరాలు జరుపుకున్న రహానే

న్యూఢిల్లీ : దేశవాళీ వన్డే టోర్నీ దేవధర్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్కోర్ బోర్డు తప్పిదంతో పప్పులో కాలేసిన రహానే 97 పరుగులకే సెంచరీ అయిందని సంబరాలు చేసుకున్నాడు. సహచర ఆటగాడు సురేశ్‌ రైనా ఇది గుర్తించడంతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘సీ’ను విజయం వరించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని భారత్‌ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్‌ ‘బి’పై గెలిచి టైటిల్‌ సొంతం చేసుకుంది. 

ఏంజరిగిందంటే.. భారత బీ బౌలర్‌ నదీమ్‌ వేసిన 37ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్‌ రాబట్టిన రహానే సెంచరీ పూర్తయిందని డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు బ్యాట్‌ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులతో పాటు, గ్యాలరీలోని ప్రేక్షకులు కూడా రహానేను చప్పట్లతో అభినందించసాగారు. మరోవైపు స్కోరుబోర్డుపై కూడా అతను శతకం పూర్తి చేసుకున్నట్లు కనిపించింది. కానీ అప్పటికీ రహానే  స్కోరు 97 పరుగులే అని.. ఇంకా శతకానికి మరో మూడు పరుగులు చేయాల్సి ఉందని సహచర ఆటగాడు సురేశ్‌ రైనా చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. 

కెప్టెన్‌ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యఛేదనకు దిగిన భారత్‌-బి సైతం గట్టిగానే పోరాడింది. భారత్‌-బి జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (60; 7 పోర్లు, 1 సిక్స్‌)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేంత పనిచేశారు. కానీ భారత్‌-సీ బౌలర్లు చెలరేగడంతో భారత్‌-బి 46.1ఓవర్లలో 323పరుగులకు ఆలౌట్‌ అయింది. 


 

మరిన్ని వార్తలు