వెటెల్‌దే విజయం

26 Mar, 2018 03:44 IST|Sakshi

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్‌ కైవసం

 మెల్‌బోర్న్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో తొలి విజయం ఫెరారీ జట్టు ఖాతాలోకి వెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీజన్‌లోని మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెటెల్‌ నిర్ణీత 58 ల్యాప్‌లను గంటా 29 నిమిషాల 33.283 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 25 ల్యాప్‌ల వరకు అగ్రస్థానంలోనే ఉన్న హామిల్టన్‌ ఆ తర్వాత ఆధిక్యాన్ని వెటెల్‌కు కోల్పోయాడు.

25వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చిన వెటెల్‌ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. కెరీర్‌లో 200వ రేసులో పాల్గొన్న అతను 48వ టైటిల్‌ను గెలిచాడు. కిమీ రైకోనెన్‌ (ఫెరారీ) మూడో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్‌) నాలుగో స్థానంలో, అలోన్సో (మెక్‌లారెన్‌) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టుకు ఈ రేసు నిరాశ మిగిల్చింది. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్‌ 11వ స్థానంలో, ఒకాన్‌ 12వ స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పోటీపడగా ఐదుగురు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఏప్రిల్‌ 9న జరుగుతుంది.

మరిన్ని వార్తలు