మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

26 Jul, 2019 15:43 IST|Sakshi

బ్యూనోస్‌ ఎయిర్స్‌: రింగ్‌లో ప్రత్యర్ధి పిడిగుద్దులు మరో బాక్సర్‌ ప్రాణం తీశాయి.  బాక్సింగ్‌ రింగ్‌లో తీవ్రంగా గాయపడి రష్యా చెందిన బాక్సర్‌ మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ మంగళవారం తుది శ్వాస విడవగా, మరొక బౌట్‌లో గాయాలు పాలైన అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. గత శనివారం ఉరేగ్వే బాక్సర్‌ ఎడ్వర్డో అబ్రెతో  జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న తర్వాత సాంతిల్లాన్‌ రింగ్‌లోనే  కుప్పకూలిపోయాడు. 10వ రౌండ్‌ తర్వాత మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్‌ నిలబడలేకపోయాడు. దాంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్‌ ప్రాణాలు విడిచాడు.  2015లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్‌.. ఇప్పటివరకూ 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును కల్గి ఉన్నాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్‌ విజయాలు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్‌ ఫెదర్‌వెయిట్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్‌ వెలుగులోకి వచ్చాడు.  సాంతిల్లాన్‌ మృతిపై వరల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాటినో సిల్వర్‌ లైట్‌ వెయిట్‌ టైటిల్‌లో భాగంగా అబ్రెతో జరిగిన పోరులో 23 ఏళ్ల సాంతిల్లాన్‌ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది. (ఇక్కడ చదవండి: ప్రాణం తీసిన పంచ్‌)

మరిన్ని వార్తలు