పాఠాలు నేర్చుకుంటారా?

7 Aug, 2018 00:24 IST|Sakshi

బ్యాటింగ్, ఫీల్డింగ్‌ మెరుగవ్వాలి

తుది జట్టు కూర్పుపై కోచ్, కెప్టెన్‌ పునరాలోచన చేయాలి

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో నిఖార్సయిన విదేశీ జట్లేవంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌. ఇంటాబయటా పోటీ ఇవ్వగల సత్తా వీటి సొంతం. నాలుగేళ్ల క్రితం ఆసీస్‌ పర్యటన మధ్యలో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు కాబట్టి ఆ సిరీస్‌ను  వదిలేస్తే.., విరాట్‌ కోహ్లికి ఈ ఏడాది ప్రారంభంలో సఫారీ పర్యటన రూపంలో తొలి కఠిన సవాల్‌ ఎదురైంది. అదే సమయంలో సిరీస్‌ గెలిచేంత చక్కటి అవకాశం సైతం దక్కింది. కానీ, పరిస్థితులకు తగని నిర్ణయాలతో దానిని చేజార్చుకున్నాడు. వాటిని సరి చేసుకున్నాక కాని విజయం దక్కలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రూపంలో ముందున్న రెండో సవాల్‌లోనూ గత తప్పులనే చేస్తున్నాడు. పూర్తిగా కాకున్నా, తొలి టెస్టు ఓటమికి అవీ కొంత కారణమే. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకైనా పొరపాట్లను  సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.  

సాక్షి క్రీడా విభాగం 
బర్మింగ్‌హామ్‌ టెస్టులో పేస్‌ విభాగంలో భువనేశ్వర్, బుమ్రా లేకున్నా భారత్‌కు ఆ లోటు కనిపించలేదు. అశ్విన్‌ ప్రతిభతో రెండో స్పిన్నర్‌ అవసరం అన్న మాటే వినిపించలేదు. అటు ప్రత్యర్థి జట్టు ప్రధాన బౌలర్లు అండర్సన్, బ్రాడ్‌ భీకరంగా విరుచుకుపడలేదు. వారి మేటి బ్యాట్స్‌మెన్‌ కూడా విశేషంగా ఏమీ రాణించలేదు. అయినా టీమిండియా ఓడింది. కారణం, ఎప్పుడూ చెప్పుకొనే బ్యాటింగ్‌ వైఫల్యమే. పైకి కనిపించేది కూడా ఇదే. కోహ్లి మినహా నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరైనా కనీసం అర్ధ శతకం సాధిస్తే మ్యాచ్‌ ఫలితం వేరేగా ఉండేది. అందుకే వీరి ఆటతో చిర్రెత్తిందేమో? టెయిలెండర్లను చూసి నేర్చుకోవాలంటూ కెప్టెన్‌ చురకేశాడు. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా కోహ్లి అద్వితీయంగా ఆడినా, సారథిగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఇందులో ప్రధానమైనవి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కొనసాగింపు, పుజారాను పక్కన పెట్టడం. మ్యాచ్‌ మూడో రోజు కీలక సమయంలో ప్రత్యర్థి కోలుకునేంతవరకు ఉపేక్షించడం మరో తప్పిదం. ఈ ఫలితంతో అయినా రెండో టెస్టుకు జట్టు ఎంపికలో పొరపాటు లేకుండా చూసుకోవాలి. లేదంటే సిరీస్‌లో 0–2తో వెనుకబడటం ఖాయం. 

ధావన్‌ ఇంకా ఎందుకు? 
విదేశీ గడ్డపై టెస్టుల్లో ధావన్‌ది పూర్తి నిరాశాజనక ప్రదర్శన. ఎస్సెక్స్‌తో సన్నాహక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌తోనే అతడిపై ఆశలు సన్నగిల్లాయి. కానీ తుది జట్టులో కొనసాగించారు. బ్యాట్స్‌మన్‌గానే తన స్థానం ప్రశ్నార్థకంగా ఉన్న స్థితిలో... ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచి ఫీల్డర్‌గానూ మైనస్‌ మార్కులు వేసుకున్నాడు. రెండోది... రాహుల్‌ స్థానం. ఓపెనింగ్‌ తప్ప అతడు మరెక్కడా ఇమడలేనన్నట్లున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దూరంగా వెళ్తున్న బంతిని వికెట్ల మీదకు ఆడుకుని, రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ ఇన్‌ స్వింగర్‌కు ఔటయ్యాడు. పుజారా వంటి టెస్టు స్పెషలిస్ట్‌ను వదిలేసి మరీ తనను ఎంపిక చేస్తే... అందుకు న్యాయం చేయలేకపోయాడు.   

రహానే... మరీ ఇలానా? 
ఇక వైస్‌ కెప్టెన్‌గా తన బాధ్యతలకు న్యాయం చేయలేని రహానేని ఏమని చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. విదేశాల్లో కోహ్లి తర్వాత మంచి రికార్డున్నరహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక సమయంలో క్రీజులోకి వచ్చి తనపై తనకే నమ్మకం సన్నగిల్లేలా ఆడాడు. ఓ సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. 

ఉపేక్షించి... చేతులు కాల్చుకున్నారు 
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్యామ్‌ కరన్‌ క్రీజులోకి వచ్చేటప్పటికి జట్టు స్కోరు 87/7. లక్ష్యం 150 దాటితే ఛేదన కష్టంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే కోహ్లి మరో తప్పిదం చేశాడు. వరుసగా ఓవర్లు వేసి అలసిపోయిన షమీ, ఇషాంత్‌లనే కొనసాగించి... కరన్‌కు పరుగులు చేసే అవకాశమిచ్చాడు. 36వ ఓవర్‌ తర్వాత కాని ఉమేశ్‌ యాదవ్‌కు బంతినివ్వాలని కోహ్లికి అనిపించలేదు. తాజాగా వచ్చిన ఉమేశ్‌ మంచి పేస్‌తో కరన్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆఖరికి అతడే వికెట్‌ను పడగొట్టాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కరన్‌ టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చేయాల్సినంత నష్టం చేసేశాడు. చివరి మూడు వికెట్లకు ఇంగ్లండ్‌ 93 పరుగులు జత చేస్తే అందులో కరన్‌వే 63. దీనిని బట్టి కోహ్లి సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయాడని చెప్పవచ్చు.   

మరిన్ని వార్తలు