90 నిమిషాల్లోనే...

11 Oct, 2017 00:00 IST|Sakshi

పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం

రెండో టెస్టులోనూ లంక ఘన విజయం

దుబాయ్‌: పాకిస్తాన్‌ విజయలక్ష్యం 317 పరుగులు... ఓవర్‌నైట్‌ స్కోరు 198/5. నాలుగో రోజు చివర్లో ఆ జట్టు సాగించిన పోరాటాన్ని బట్టి చూస్తే విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చివరి రోజు మంగళవారం శ్రీలంక ఆ అవకాశం ఇవ్వలేదు. గంటన్నర వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లు పడగొట్టి పాక్‌ కథ ముగించింది. 68 పరుగుల తేడాతో రెండో టెస్టులో విజయం సాధించి 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 248 పరుగులకు ఆలౌటైంది.

అసద్‌ షఫీఖ్‌ (176 బంతుల్లో 112; 10 ఫోర్లు) సెంచరీతో పాటు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (130 బంతుల్లో 68; 5 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించినా... అది జట్టును రక్షించడానికి సరిపోలేదు. ఆఫ్‌స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరా (5/98) పాక్‌ను దెబ్బ తీశాడు. దిముత్‌ కరుణరత్నేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. తొలి టెస్టులో శ్రీలంక 21 పరుగులతో నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఈనెల 13న మొదలవుతుంది.

1 యూఈఏని తమ సొంత మైదానంగా మార్చుకున్న తర్వాత (2010) పాకిస్తాన్‌ అక్కడ టెస్టు సిరీస్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు పాక్‌ 9 సిరీస్‌లు ఆడగా...5 గెలిచి మరో 4 డ్రా చేసుకుంది.  

మరిన్ని వార్తలు