రెండో టెస్ట్‌ పుజారా ఆడుతాడా?: సెహ్వాగ్‌

6 Aug, 2018 18:37 IST|Sakshi
పుజారా

న్యూఢిల్లీ : టీమిండియా నయావాల్‌ చతేశ్వర పుజారాను ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు పక్కనబెట్టి బరిలోకి దిగిన కోహ్లి సేన తగిన మూల్యం చెల్లించుకుంది. విజయం ముంగిట తడబడి కేవలం 31 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అయితే పుజారాను పక్కకు పెట్టడాన్ని ఇప్పటికే సీనియర్‌ క్రికెటర్లు, అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు తప్పుబట్టారు. బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా ఆడుతున్నా... కెప్టెన్సీ విషయంలో కోహ్లి ఆలోచనలు మారాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ఈ నేపథ్యంలో  రెండో టెస్ట్‌ కూర్పు చర్చనీయాంశమైంది.

అయితే ఈ పరిస్థితుల్లో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిమానులకు ఓ ప్రశ్నవేసాడు. పోప్‌ ఇంగ్లండ్‌ తరపున బరిలోకి దిగుతున్నాడు.. మరీ రెండో టెస్ట్‌లో పుజారా ఆడుతాడా? అని ప్రశ్నించాడు. దీనికి అభిమానులు పక్కా.. 100% ఆడుతాడని సమాధానమిచ్చారు. మరి కొందరైతే.. రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాలని, శిఖర్‌ ధావన్‌ను పక్కన పెట్టాలని సూచించారు. అసలు తొలి టెస్ట్‌లో ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని, పుజారా ఉంటే మ్యాచ్‌ గెలిచేదని అభిప్రాయపడ్డారు. తొలి టెస్ట్‌లో ఒక్క కోహ్లి మినహా బ్యాట్స్‌మెన్‌ అంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో పుజారా అవసరం ఎంటో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది. పుజారా ఆడిన 58 టెస్టుల్లో భారత్‌ 33 మ్యాచులు నెగ్గి 12 మాత్రమే ఓడగా.. మరో 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆగస్టు 9 నుంచి లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

చదవండి: కోహ్లిని అవమానించే యత్నం.. వైరల్‌

మరిన్ని వార్తలు