అందుకు సెహ్వాగే కారణం: కేఎల్‌ రాహుల్‌

4 Jun, 2018 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో ఆరు మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్నట్లు కనిపించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  సెకండాఫ్‌లో వరుస వైఫల్యాలతో చతికిలబడింది. ఫలితంగా కనీసం ప్లేఆఫ్‌కు చేరకుండానే టోర్నీ నుంచి కింగ్స్‌ పంజాబ్‌ నిష్క్రమించింది. అయితే జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా.. మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాడని కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు.

‘టోర్నీలో భాగంగా నేను సెహ్వాగ్‌తో చాలాసార్లు మాట్లాడాను. అతను ఆటను ఎంతో సులభంగా మార్చేవాడు. మిగతా ఆటగాళ్లను కూడా అదేవిధంగా ఆడాలంటూ సలహాలు ఇచ్చేవాడు. మన ఆత్మస్థైర్యాన్ని నమ్ముకొని బరిలోకి దిగాలని, చిరునవ్వుతో ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని సూచించాడు. ఈ స్వేచ్ఛ కేవలం నాకు మాత్రమే కాదు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇస్తుండేవాడు. మేము స్వేచ్ఛగా ఆడామంటే.. అందుకు సెహ్వాగే కారణం’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

‘ఒక జట్టుగా ఆడాలంటే మనకు కావాల్సింది ఇలాంటి బ్రాండ్‌ క్రికెటే. ఫలితం గురించి ఆలోచించకుండా ఎంతో ధైర్యంగా, దూకుడుగా ఆడటానికే ప్రాధాన్యతనివ్వాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్కోసారి ఇది సాధ్యపడుతుంది. కొన్ని సార్లు కుదరదు కూడా.. అయినా అలాగే ముందుకు సాగుతుండాలి’ అని రాహుల్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు