అతనిలా బ్యాటింగ్ చేయాలని ఉండేది:సెహ్వాగ్

10 Oct, 2017 20:16 IST|Sakshi

న్యూఢిల్లీ:దాదాపు పదిహేడేళ్ల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇప్పటి జట్టుకు చాలా వ్యత్యాసం ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి స్పష్టం చేశాడు. ఇప్పటి ఆసీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని గతంలోనే వ్యాఖ్యానించిన సెహ్వాగ్.. మరోమారు ఆ విషయాన్ని  వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కలిసి ‘బోల్‌ వీరూ బోల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే తన పాత జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న సెహ్వాగ్.. ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్ క్రిస్ట్ పై ప్రశంసలు కురిపించాడు.

'అతనొక భయంకరమైన బ్యాట్స్ మన్. అతని బ్యాటింగ్ ను చూడటాన్ని ఎప్పుడూ ఇష్టపడేవాణ్ని. ఆ సమయంలో ఆసీస్ జట్టులో దూకుడుగా ఉన్న ఆటగాళ్లలో గిల్లీ ఒకడు. అప్పట్లో గిల్లీది ఆసీస్ జట్టులో ప్రధాన పాత్ర. అటు బ్యాట్స్ మన్ గా, కీపర్ గా గిల్ క్రిస్ట్ తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. అతనిలా బ్యాటింగ్ చేయాలని ఉండేది. గిల్లీ అవుటైనా మైదానం నుంచి వెళ్లేవాడు కాదు. ఒకసారి ఆసీస్-పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ లో పాక్ విజయం దాదాపు ఖాయం. లాంగర్ తో గిల్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్ వేసిన బంతికి గిల్లీ అవుటయ్యాడు. కానీ అతను మైదానాన్ని వీడి వెళ్లలేదు. అంపైర్ కూడా దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. మరో సందర్భంలో ప్రపంచకప్ సెమీ ఫైనల్లో పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతుంటే ఇలాంటి సన్నివేశమే చోటు చోసుకుంది. అతనికి ఎప్పుడు వెళ్లాలో.. ఎప్పుడు వెళ్లకూడదో బాగా తెలుసు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేసేవాడు. గిల్లీ ఒక అసాధారణ ఆటగాడు'అని సెహ్వాగ్ కొనియాడాడు.
 

మరిన్ని వార్తలు