మూడో స్థానంలో మళ్లీ ఆ పేరు : సెహ్వాగ్‌

15 Jun, 2018 13:23 IST|Sakshi
వీరేంద్ర సెహ్వాగ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : భారత్‌-అఫ్గానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులోని ఓ ఆసక్తికర విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లు మంచి శుభారంభాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ధావన్‌(107) వికెట్‌ అనంతరం క్రీజులోకి కేఎల్‌ రాహుల్‌ వచ్చాడు. అయితే ఇలా రాహుల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ రావడమే ఆసక్తికరమని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. 

‘చాలా రోజుల తర్వాతా మళ్లీ ఈ మూడో స్థానంలో రాహుల్‌ పేరు వినిపించింది’ అని ట్వీట్‌ చేశాడు. అవును ఫస్ట్‌ డౌన్‌లో మాజీ క్రికెటర్‌, టీమిండియా వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వచ్చేవాడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్‌ గుర్తు చేస్తూ ఇన్నాళ్లకు మళ్లీ ఆ పేరు ఆ స్థానంలో వినిపించిందని తనదైన శైలిలో పేర్కొన్నాడు. ఈ స్థానంలో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ సైతం బాధ్యాతాయుతంగా ఆడి హాఫ్‌ సెంచరీతో అండగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 474 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అఫ్గాన్‌ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

మరిన్ని వార్తలు