సూపర్‌ సింధు

17 Dec, 2016 00:14 IST|Sakshi
సూపర్‌ సింధు

మారిన్‌పై విజయంతో సెమీస్‌లోకి  

దుబాయ్‌: రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు బదులు తీర్చుకుంది. సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సింధు 21–17, 21–13తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్‌ చాంపియన్‌ మారిన్‌ను మట్టికరిపించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్‌ వరుసగా మూడు పరాజయాలతో ఈ టోర్నీని ముగించి ఇంటిదారి పట్టింది. ఇదే గ్రూప్‌ నుంచి సున్‌ యు మరో సెమీస్‌ బెర్త్‌ను దక్కించుకుంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి సుంగ్‌ జీ హున్‌ (కొరియా), తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌తో సింధు, సుంగ్‌ జీ హున్‌తో సున్‌ యు తలపడతారు.

ప్రపంచ రెండో ర్యాంకర్‌ మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆద్యంతం దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌ ఆరంభంలో 3–7తో వెనుకబడిన సింధు ఆ వెంటనే కోలుకొని వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 8–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. అయితే స్కోరు 11–12 వద్ద సింధు మరోసారి ఐదు వరుస పాయింట్లు నెగ్గి 16–12తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ప్రణాళిక ప్రకారం ఆడి మారిన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా