సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లేనా?

6 Dec, 2016 12:41 IST|Sakshi
సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లేనా?

జ్యూరిచ్:అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిపా)లో భారీ అవినీతికి పాల్పడి ఆరేళ్ల పాటు నిషేధానికి గురైన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లే కనబడుతోంది. తన ఆరేళ్ల నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్లో దాఖలు చేసిన పిటిషన్పై బ్లాటర్కు చుక్కెదురైంది. ఆ పిటిషన్ను కోర్టు సోమవారం తిరస్కరించడంతో బ్లాటర్ ఇక మళ్లీ ఫిఫాలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఈ మేరకు సోమవారం విచారించిన కోర్టు..బాట్లర్ నిషేధంపై దాఖలైన పిటిషన్ను కొట్టిపారేసింది. దాదాపు 12 కోట్ల రూపాయిలను(2 మిలియన్ డాలర్లు)ను యూఈఎఫ్ఏ అధ్యక్షుడు ప్లాటినీ ఖాతాలోకి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని చర్యగా కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని బ్లాటర్ స్పష్టం చేశాడు. కాగా, ఆ తీర్పును స్విస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపాడు. దాంతోపాటు తాను ఏ తప్పు చేయలేదనే వాదనకు బ్లాటర్ కట్టుబడ్డాడు. సుమారు 41 ఏళ్ల ఫిఫా అనుభవం తన సొంతమని బ్లాటర్ పేర్కొన్నాడు.సాకర్ గేమ్లో అనేక విజయాలను  చూసిన తనకు, అపజయాలను కూడా చూశానంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.

పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ను ఇటీవల ఫిఫా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎనిమిదేళ్ల పాటు అతనిపై నిషేధం విధిస్తూ ఫిఫా నిర్ణయం తీసుకుంది. దాన్ని కోర్టులో సవాల్ చేయడంతో బ్లాట్లర్ నిషేధం ఆరేళ్లకు తగ్గింది. మరోసారి తన నిషేధాన్ని సవాల్ చేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించినా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. ప్రస్తుతం బ్లాటర్ లేటు వయసులో ఉండటం ఒక కారణమైతే, ఆరేళ్ల తరువాత పరిస్థితులు అతనికి అనుకూలంగా  ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. దీంతో బ్లాటర్ కు ఫిఫాతో ఉన్న బంధం-అనుబంధం ముగిసిందనే చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు