సెరెనా శుభారంభం

30 May, 2018 05:31 IST|Sakshi

తొలి రౌండ్‌లో ప్లిస్కోవాపై గెలుపు

నాదల్, సిలిచ్‌ ముందంజ

యూకీ బాంబ్రీ పరాజయం  

పారిస్‌: తల్లి అయ్యాక ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ శుభారంభం చేసింది. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 36 ఏళ్ల సెరెనా 7–6 (7/4), 6–4తో గెలుపొందింది. గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక ఇటీవలే మళ్లీ రాకెట్‌ పట్టింది. ప్లిస్కోవాతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో బ్రేక్‌ పాయింట్‌ కాపాడుకున్న సెరెనా టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్‌లో ఒకదశలో 0–3తో వెనుకబడిన ఈ మాజీ చాంపియన్‌ వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.  

మహిళల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్‌ షరపోవా (రష్యా) 6–1, 4–6, 6–3తో హోగెన్‌కాంప్‌ (నెదర్లాండ్స్‌)పై, మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 7–6 (7/0), 6–2తో స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) పై, ఏడో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–1, 6–0తో దువాన్‌ (చైనా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ తొలి రౌండ్‌లో 6–4, 6–3, 7–6 (11/9)తో బొలెలీ (ఇటలీ)పై, మూడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–3, 7–5, 7–6 (7/4)తో డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరారు. 14వ సీడ్‌ జాక్‌ సాక్‌ (అమెరికా) 7–6 (7/4), 6–2, 6–4, 6–7 (5/7), 3–6తో జర్గెన్‌ జాప్‌ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ 4–6, 4–6, 1–6తో రూబెన్‌ బెమెల్‌మాన్స్‌ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యాడు.   

అందుకే ‘క్యాట్‌ సూట్‌’...
అమ్మగా మారిన తర్వాతి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ బరిలో నిలిచిన సెరెనా విలియమ్స్‌ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. నైకీ ప్రత్యేకంగా తయారు చేయించిన నలుపు రంగు ‘క్యాట్‌సూట్‌’లో ఆమె మైదానంలో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంది. గతంలోనూ సెరెనా ఇలాంటి డ్రెస్‌ ధరించినా... కూతురు పుట్టిన తర్వాత తొలి మెగా టోర్నీ కావడంతో అది చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడుతూ...‘అక్కడ ఉన్న అమ్మలందరి కోసమే ఇది. అందరూ గర్భవతిగా కఠిన పరీక్షను ఎదుర్కొని నిలిచినవారే. ఆ తర్వాత మళ్లీ తిరిగొచ్చి అంతే పదునుగా ఉండేందుకు ప్రయత్నించేవారే. నా వస్త్రధారణ అలాంటివారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని భావిస్తున్నా...కాదంటారా? ఈ డ్రెస్‌లో యోధురాలైన మహరాణిలా నన్ను నేను ఊహించుకుంటున్నా. నా కలల ప్రపంచంలో సూపర్‌ హీరోను కావాలనుకున్నా. ఇది వేసుకుంటే సూపర్‌ హీరోలా అనిపిస్తోంది’ అని సెరెనా విలియమ్స్‌ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు