సెరెనాకు 58వ టైటిల్

5 Jan, 2014 00:49 IST|Sakshi
సెరెనా

బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బ్రిస్బేన్ ఓపెన్‌లో చెల్లెలు సెరెనా చాంపియన్‌గా నిలువగా... ఆక్లాండ్ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో అక్క వీనస్, సెర్బియా బ్యూటీ అనా ఇవనోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.
 
 శనివారం జరిగిన ఫైనల్స్‌లో నంబర్‌వన్ సెరెనా 6-4, 7-5తో రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి తన కెరీర్‌లో 58వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో ఈనెల 13న ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతానని సెరెనా పేర్కొంది. విజేతగా నిలిచిన సెరెనాకు 1,96,670 డాలర్ల (రూ. కోటీ 22 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
 
 మూడేళ్ల తర్వాత...
 ఇద్దరు మాజీ నంబర్‌వన్‌ల మధ్య న్యూజిలాండ్‌లో జరిగిన ఆక్లాండ్ ఓపెన్ ఫైనల్లో ఇవనోవిచ్ 6-2, 5-7, 6-4తో వీనస్ విలియమ్స్‌పై గెలిచింది. 2011లో బాలి ఓపెన్ టైటిల్ తర్వాత ఇవనోవిచ్ ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా 2008 తర్వాత వీనస్‌ను ఇవనోవిచ్ ఓడించడం ఇదే తొలిసారి. విజేతగా నిలిచిన ఇవనోవిచ్‌కు 43 వేల డాలర్లు (రూ. 26 లక్షల 76 వేలు) దక్కాయి.

మరిన్ని వార్తలు