గర్భస్థ శిశువుపై ఇలానా మాట్లాడేది?

26 Apr, 2017 00:36 IST|Sakshi
గర్భస్థ శిశువుపై ఇలానా మాట్లాడేది?

నస్టాసే వ్యాఖ్యలపై సెరెనా ఆగ్రహం

న్యూయార్క్‌: పురుషుల టెన్నిస్‌ మాజీ నంబర్‌వన్‌ ఇలీ నస్టాసే చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలపై అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఘాటుగా స్పందించింది. ఇంకా లోకం చూడని తన గర్భస్థ శిశువు రంగుపై మాట్లాడిన నస్టాసేపై భగ్గుమంది. ఫెడ్‌ కప్‌ సందర్భంగా రొమేనియా కోచ్‌ నస్టాసే నల్ల జాతీయురాలైన సెరెనాకు పుట్టబోయే శిశువు నల్లగా పుడుతుందా లేక ప్రియుడి తెల్ల రంగులో ఉంటుందా అని విపరీత ధోరణిలో మాట్లాడటం వివాదం రేపింది. దీనిపై సామాజిక సైట్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో స్పందించిన సెరెనా ‘ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అసలు ఇలీ నస్టాసే లాంటివాళ్లున్న సమాజంలో మనం ఉండటమా? ఇదెంతటి బాధాకరమైన విషయం. కేవలం వారాల వయస్సున్న ఓ గర్భస్థ శిశువుపై ఇలా మాట్లాడటం సిగ్గుచేటు’ అని పోస్ట్‌ చేసింది.

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) నస్టాసేను సస్పెండ్‌ చేయడంపై మాట్లాడుతూ ‘సత్వరం స్పందించిన ఐటీఎఫ్‌కు కృతజ్ఞతలు. సస్పెన్షన్‌ చర్యకు నేను మద్దతిస్తున్నా. నేను ఇంతకుముందే చెప్పా... ఇపుడూ చెబుతున్నా... ఈ ప్రపంచం ఎంతో ముందుకెళ్లింది... కానీ ఇది సరిపోదు! ఇంకా అక్కడక్కడ ఉన్న కట్టుబాట్ల గడుల్ని జాత్యహంకార కంచెల్ని దాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నా గళం ఎప్పుడూ మద్దతు పలుకుతుంది’ అని సెరెనా పోస్ట్‌ చేసింది. తల్లి కాబోతున్న సెరెనా ఒక్కరిపైనే కాదు... రొమేనియా, బ్రిటన్‌ జట్ల మధ్య ఫెడ్‌ కప్‌ మ్యాచ్‌ జరిగిన సందర్భంగా బ్రిటన్‌ క్రీడాకారిణి జొహానా కొంటా, కెప్టెన్‌ ఆనీ కియోతవోంగ్, చైర్‌ అంపైర్‌లపైనా నస్టాసే నోరు పారేసుకున్నారు. జొహానా కొంటాను అవమానపరిచే పదజాలంతో దూషించారు.

మరిన్ని వార్తలు