సెరెనా ఆడట్లేదు!

6 Jan, 2018 01:09 IST|Sakshi

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ నుంచి వైదొలగింది. ఈ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పింది. ‘అన్ని రకాలుగా (ఫిట్‌నెస్, ఆటతీరు) సిద్ధమైనపుడే బరిలోకి దిగాలని నా కోచ్‌ సూచించారు. ఇప్పుడైతే నేను ఆడగలను. కానీ ఓ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ పోటీకి న్యాయం చేయలేను. మరింత మెరుగైన తర్వాతే కోర్టులోకి దిగుతా. ఇందుకోసం ఇంకాస్త సమయం అవసరం’ అని సెరెనా ఓ న్యూస్‌ ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

గత జనవరిలో గర్భంతోనే బరిలోకి దిగిన సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచింది. తద్వారా ఆమె తన కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె తన గారాలపట్టి ఒలింపియాతో సేదతీరుతోంది. ప్రసవం తర్వాత గత నెల 30న అబుదాబిలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒస్టాపెంకోతో 36 ఏళ్ల సెరెనా తలపడింది. ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆమె ఓడింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు