ఆగి...వేస్తానంటే కుదరదు!

25 Oct, 2014 01:25 IST|Sakshi
ఆగి...వేస్తానంటే కుదరదు!

బౌలింగ్ యాక్షన్‌లపై ఐసీసీ సీరియస్
జాబితాలో అశ్విన్, రైనా
 

దుబాయ్: ‘బౌలింగ్ ప్రారంభించి, బంతి విసిరే లోపు టీవీలో ప్రకటన ప్రసారం చేయవచ్చు...ఈ మధ్య సమయంలో ఒక సినిమా చూసేయవచ్చు’ ...భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ శైలిపై తరచుగా వినిపించే జోక్‌లు ఇవి. ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి బౌలింగ్ శైలి సీరియస్ అంశం కానుంది. బౌలర్ల చకింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పుడు మరో కోణంపై దృష్టి పెట్టింది. ఇకపై బౌలింగ్ చేసేటప్పుడు ‘పాజ్’ (ఆగి ఆగి బంతి విసరడం) ఇస్తే దానిపై చర్య తీసుకునే హక్కు అంపైర్లకు ఐసీసీ కల్పించింది. ఈ అక్టోబర్‌నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల (42.2) ప్రకారం బౌలర్ ఆ తరహాలో బంతి విసిరితే అది సరైందా, కాదా అని అప్పటికప్పుడు అంపైర్లు నిర్ణయిస్తారు. దాంతో వారి బాధ్యత మరింత పెరగనుంది.

‘ఎంత సేపు బంతిని ఆపుతున్నారో చెప్పేందుకు మేమేమీ స్టాప్ వాచ్‌లు పెట్టుకోలేం. అది ప్రతీ బంతికి తేడా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే అంపైర్లు వ్యవహరిస్తారు. అలాంటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్ ఏకాగ్రత చెదురుతుందని భావిస్తే దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించవచ్చు’ అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్‌తో పాటు మరో భారత బౌలర్ సురేశ్ రైనా, పాకిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ హఫీజ్ ఈ తరహా శైలితో బౌలింగ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు