‘రియో’కు ఏడుగురు షట్లర్ల అర్హత

4 May, 2016 00:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి భారత్ నుంచి అత్యధికంగా ఏడుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్), కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), సుమీత్ రెడ్డి-మనూ అత్రి (పురుషుల డబుల్స్), గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్) అర్హత పొందారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా ఐదుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొనగా... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది.
 
1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టారు. 1992లో విమల్ కుమార్-దీపాంకర్ భట్టాచార్య పురుషుల సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ పోటీపడ్డారు. ఆ తర్వాత వరుసగా ఐదు ఒలింపిక్స్‌లలో పురుషుల డబుల్స్‌లో భారత ప్రాతినిధ్యం లేదు. ఈసారి రియో ఒలింపిక్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి రూపంలో పురుషుల డబుల్స్‌లో భారత జోడీ బరిలోకి దిగనుంది. మహిళల సింగిల్స్‌లో తొలిసారి భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

మరిన్ని వార్తలు