అది మా పరిధి కాదు

4 Mar, 2019 00:40 IST|Sakshi

పాక్‌తో సంబంధాలు తెంచుకోవాలన్న బీసీసీఐ విజ్ఞప్తిపై ఐసీసీ

క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా కుంబ్లే కొనసాగింపు 

దుబాయ్‌: ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్‌ ప్రపంచం పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇది ఏమాత్రం తమ పరిధిలో లేని అంశమని, క్రికెట్‌ నిర్వహణ మాత్రమే తమ ప్రధాన బాధ్యత అని ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తేల్చి చెప్పారు. సంబంధాలు తెంచుకోవడం అనేది ఆయా దేశాల ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారమని ఐసీసీ స్పష్టం చేసింది. పుల్వామా దాడి తర్వాత గత నెల 22న బీసీసీఐ ఈ లేఖ రాసింది. ఈ లేఖలో నేరుగా పాకిస్తాన్‌ పేరు ప్రస్తావించకపోయినా టెర్రరిస్టులకు పాక్‌ అండగా నిలుస్తోందని అందులో పరోక్షంగా పేర్కొంది.

ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై మనోహర్‌ మాట్లాడారు. నిజానికి లేఖ రాసిన బీసీసీఐ తరఫున సమావేశానికి హాజరైన బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి లేఖ ప్రస్తావన తీసుకురాకపోయినా... మనోహరే స్వయంగా ఈ విషయంపై స్పందించి స్పష్టతనిచ్చారు. సమావేశంలోనే ఉన్న పాకిస్తాన్‌ బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి కూడా చర్చపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం విశేషం. మరోవైపు ‘పాక్‌పై నిషేధం’లాంటిది సాధ్యం కాదని తమకు ముందే తెలిసినా సరే బోర్డు ఒక ప్రయత్నం చేసింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు దీనిపై వ్యాఖ్యానించారు. అయితే వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని మాత్రం ఐసీసీ హామీ ఇచ్చింది. మెగా ఈవెంట్‌లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానులందరికీ తగిన రీతిలో భద్రత కల్పించడం తమ బాధ్యత అని ఐసీసీ సీఈ డేవ్‌ రిచర్డ్సన్‌ స్పష్టం చేశారు.

మహిళల కోసం అండర్‌–19 వరల్డ్‌ కప్‌!

►తాజా సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీలో ప్రత్యేకంగా మహిళల క్రికెట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ క్లార్‌ కానర్‌ నేతృత్వం వహిస్తుంది.  

►మరోవైపు 2023 లోపు మహిళల కోసం ఏజ్‌ గ్రూప్‌ వరల్డ్‌ కప్‌ కూడా నిర్వహించనుంది. అయితే ఇది పురుషుల తరహాలో అండర్‌–19 స్థాయిలో ఉంటుందా లేక అండర్‌–17 స్థాయిలో నిర్వహిస్తారా అనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.  

►వచ్చే టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలకు వేదికలుగా యూఏఈ (పురుషులు), స్కాట్లాండ్‌ (మహిళలు)లను ఎంపిక చేశారు. భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మళ్లీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. వచ్చే మూడేళ్ల పాటు అతను ఈ పదవిలో కొనసాగుతాడని ఐసీసీ వెల్లడించింది.  

►శ్రీలంక బోర్డులో వివాదాల కారణంగా ఇప్పటి వరకు నిలిపి ఉంచిన 11.4 మిలియన్‌ డాలర్లను కూడా ఐసీసీ ఇప్పుడు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.  

►భారత్‌లో ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ సమయంలో నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించే బాధ్యత బీసీసీఐదేనని ఐసీసీ స్పష్టం చేసింది. 2022లో టి20 ప్రపంచ కప్, 2023లో వన్డే వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీల కోసం ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోతే బీసీసీఐ పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2016 టి20 ప్రపంచ కప్‌ సమయంలో కూడా ఇదే జరిగింది. ఇతర క్రికెట్‌ దేశాల్లో ఇస్తున్నట్లుగా బోర్డుకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం లేదు. అదనపు భారాన్ని మోసేందుకు తమ స్పాన్సర్లతో బీసీసీఐ చర్చలు జరుపుకోవాలని ఐసీసీ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు