జుట్టు కత్తిరించాల్సి వచ్చింది: క్రికెటర్‌ తండ్రి

3 Oct, 2019 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత మహిళా క్రికెట్‌లో యువ సంచలనం షఫాలీ వర్మ పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ పదిహేనేళ్ల అమ్మాయి.. నాలుగో టీ20లో 46 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. షఫాలీ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ 51 పరుగుల తేడాతో గెలుపొంది 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కిన షఫాలీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న షఫాలీ తండ్రి సంజీవ్‌ వర్మ... తన కూతురు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ దాగుందని పేర్కొన్నారు. షఫాలీ ఆడపిల్ల అయిన కారణంగా మొదట్లో తనతో ఎవరూ క్రికెట్‌ ఆడేవారు కాదని చెప్పుకొచ్చారు. 

మేము సచిన్‌ ఫ్యాన్స్‌
‘బహుశా తనకి అప్పుడు ఎనిమిది ఏళ్లు ఉంటాయి. అప్పుడే తను క్రికెట్‌లో ఓనమాలు దిద్దింది. ప్రతీ ఆదివారం తనను తీసుకుని గ్రౌండ్‌కు తీసుకువెళ్లేవాడిని. అయితే అక్కడికి ఎక్కువగా అబ్బాయిలే వచ్చేవారు. తనను వాళ్లతో ఆడనిచ్చేవారు కాదు. ఆడనివ్వమని నేను బతిమిలాడితే.. తను అసలే అమ్మాయి.. ఏదైనా చిన్న గాయం అయినా మీరు మమ్మల్నే తిడతారు అంటూ సమధానం చెప్పేవాళ్లు. దీంతో షఫాలీ నిరాశ పడేది. అప్పుడే నాకో ఆలోచన తట్టింది. తనను బార్బర్‌ షాపునకు తీసుకువెళ్లి అబ్బాయిల్లా జుట్టు కత్తిరించమని చెప్పాను. అదే విధంగా అబ్బాయిల్లాగానే తనను డ్రెస్‌ చేసుకోమని చెప్పాను. అలా కొన్నాళ్లపాటు షఫాలీ ప్రాక్టీస్‌ కొనసాగింది. అయితే తనను నేషనల్స్‌కు సిద్ధం చేయాలంటే క్రికెట్‌ అకాడమీలో చేర్చాలని భావించాను. అప్పుడే అసలు సమస్య మొదలైంది. అమ్మాయి అయిన కారణంగా తనను ఎవరూ చేర్చుకోలేదు. అయినా నేను పట్టువదలకుండా.. అమ్మాయిలు,  అబ్బాయిలకు శిక్షణ ఇచ్చే అకాడమీ అడ్రస్‌ కనుక్కున్నా. అయితే అది మా ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేది. దీంతో రోజూ తనను సైకిల్‌పై తీసుకువెళ్లి ప్రాక్టీసు చేయించేవాడిని అని తన కూతురి ఎదుగుదల కోసం పడిన కష్టాన్ని వివరించారు. తామిద్దరం క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ ఫ్యాన్స్‌ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం షఫాలీని స్పూర్తిగా తీసుకుని తన కుమారుడు సాహిల్‌, ఆరేళ్ల కుమార్తె నాన్సీ కూడా క్రికెట్‌పై దృష్టి సారిస్తున్నారని సంజీవ్‌ వర్మ పేర్కొన్నారు. కాగా హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన సంజీవ్‌ వర్మ ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా