షాహిన్‌ అఫ్రిది రికార్డుల మోత

6 Jul, 2019 16:47 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ లీగ్‌ దశ నుంచే నిష్క్రమించినా పలువురు క్రికెటర్లు ఆకట్టుకున్నారు. అందులో యువ సంచలనం షాహిన్‌ అఫ్రిది ఒకడు. ఈ మెగా టోర్నీలో 19 ఏళ్ల షాహిన్‌ అఫ్రిది రికార్డుల మోత మోగించాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 16 వికెట్లను సాధించి సత్తా చాటాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. మరొకవైపు ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన యువ బౌలర్‌గా కొత్త అధ్యాయం లిఖించాడు. కాగా, ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొంది హోమ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పిలవబడుతున్న లార్డ్స్‌ మైదానంలో ఐదు వికెట్లకు పైగా సాధించిన టీనేజ్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలవడం మరో విశేషం.

శుక్రవారం లార్డ్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 9.1 ఓవర్లలో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాహిన్‌ అఫ్రిదికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. దాంతో ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పిన్న వయసులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌ పిన్న వయసులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌. 1992 వరల్డ్‌కప్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఆ ఘనతను సాధించాడు. కాగా, ఆ వరల్డ్‌కప్‌ సీజన్‌లో సచిన్‌ రెండుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.


 

>
మరిన్ని వార్తలు