పాక్‌ ప్రధానిని వెనకేసుకొచ్చిన మాజీ క్రికెటర్‌

19 Feb, 2019 20:06 IST|Sakshi
ఇమ్రాన్‌ ఖాన్‌

ఉగ్రదాడిని ఖండించని ఆఫ్రిది

ఇస్లామాబాద్‌ ‌: పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌కు చెందిన ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ దాడితో తమకు సంబంధం లేదని, భారత్‌ అనవసరంగా తమను నిందిస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది ట్వీట్‌ చేశారు. ఈ ఉగ్రదాడిపై ఇమ్రాన్‌ ఏం చేప్పారో అవన్నీ వాస్తవమని, సుస్పష్టమని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కానీ ఈ ఉగ్రదాడిని మాత్రం ఖండించలేదు. కనీసం ఈ దాడిలో మరణించినవారికి సంతాపం కూడా తెలపలేదు. ఘటన జరిగి 5 రోజులైనా నోరెత్తని పాక్‌.. అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తప్పక స్పందించింది. అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్‌ చెబుతూ.. తమకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడుతోంది. ఉగ్రవాద నిర్మూలనకు తాము సిద్ధమంటూనే.. భారత్‌ దాడులకు దిగితే మాత్రం దీటుగా సమాధానం చెబుతామని తెలుపుతూ తమ దుర్భుద్దిని చాటుకుంది.  

ఇక ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఇమ్రాన్‌ స్పందన ఊహించిందేనని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమపై ఆరోపణలు చేస్తోందన్న ఇమ్రాన్‌ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ముంబై దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు భారత్‌ స్పష్టమైన ఆధారాలు అందచేసినా పదేళ్లకు పైగా ఈ కేసు ముందుకు కదలలేదని గుర్తుచేసింది. పటాన్‌కోట్‌ దాడుల్లోనూ దర్యాప్తు కొలిక్కిరాలేదని ప్రస్తావించింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌, జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌లు పాకిస్తాన్‌ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు