అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది

18 Jun, 2020 14:03 IST|Sakshi
షాహిద్‌ ఆఫ్రిది

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆఫ్రిది స్వయంగా వెల్లడించారు. అయితే స్థానిక కోవిడ్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ మాజీ క్రికెటర్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందనే వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు వార్తలపై  ఆఫ్రిది స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. (షాహిద్‌ ఆఫ్రిదికి కరోనా)

‘గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో నా ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో నా అభిమానులు, శ్రేయోభిలాషులు కలవరపడుతున్నారు. అయితే ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత రెండు మూడు రోజులు చాలా ఇబ్బందిగా అనిపించింది. మెల్లిమెల్లిగా కరోనా నుంచి కోలుకుంటున్నాను. అయితే కరోనా సోకిన తర్వాత ఎదురయ్యే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. (ఆఫ్రిదికి కరోనా.. గంభీర్‌ రియాక్షన్‌)

ఇక ఈ సమయంలో నేను ఎదుర్కొంటున్న అతి పెద్ద కష్టం పిల్లలను చూడకుండా ఉండటం. నా పిల్లలను చాలా మిస్సవుతున్నా.  నాకు కరోనా సోకుతుందని ముందే గ్రహించా. ఎందుకంటే కరోనా లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేయడానికి అనేక ప్రాంతాలు తిరిగాను. అయితే వారికి సాయం చేసిన సంతృప్తి నాకు లభించింది. నా క్షేమం కోరుతూ భగవంతుడుని ప్రార్థిస్తున్న శ్రేయోభిలాషులు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. (ఆఫ్రిదిపై కరోనా జోకులు.. చోప్రా ఆగ్రహం)

మరిన్ని వార్తలు