ఆఫ్రిది రికార్డ్ హ్యాట్రిక్.. సెహ్వాగ్ బాధితుడే..!

15 Dec, 2017 15:27 IST|Sakshi

టీ10 ఫార్మాట్లో తొలి హ్యాట్రిక్

షార్జా: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. టీ10 టోర్నీలో మూడు వరుస బంతులకు ముగ్గురు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసి ఈ ఫార్మాట్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గురువారం షార్జాలో టోర్నీ ప్రారంభమైన తొలిరోజే పాక్ ఆల్ రౌండర్ హ్యాట్రిక్‌ ఫీట్‌తో చెలరేగాడు. టీమిండియా మాజీ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా బాధితుడిగా మిగిలాడు.

ఆఫ్రిది నేతృత్వంలోని ఫక్తూన్స్ జట్టు, సెహ్వాగ్ నేతృత్వంలోని మరాఠా అరేబియన్స్ జట్ల మధ్య గురువారం టీ10 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫక్తూన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 121 పరగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన సెహ్వాగ్ జట్టు తొలి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్ వేసిన ఫక్తూన్స్ కెప్టెన్ ఆఫ్రిది తొలి బంతికి దక్షిణాఫ్రికా ఆటగాడు రిలే రోసౌను, రెండో బంతికి వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను, మూడో బంతికి టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. రోసౌ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, బ్రావో, సెహ్వాగ్‌లను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో 46/2గా ఉన్న మరాఠా అరేబియన్ టీమ్ ఆఫ్రిది దెబ్బకు 46/5 తో కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆఫ్రిది జట్టు 25 పరుగుల తేడాతో సెహ్వాగ్ జట్టుపై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు