షాహిద్‌ అఫ్రిదికి కరోనా

14 Jun, 2020 06:55 IST|Sakshi

స్వయంగా ప్రకటించిన పాకిస్తాన్‌  మాజీ క్రికెటర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్, కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అతను వెల్లడించాడు. ‘గత గురువారం నుంచి నా ఆరోగ్యం బాగా లేదు. తీవ్రంగా ఒళ్లు నొప్పులు ఉన్నాయి. దాంతో పరీక్ష చేయించుకుంటే కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలింది. దేవుడు దయతలిస్తే తొందరగా కోలుకుంటాను. నాకు మీ ప్రార్థనలు కావాలి’ అంటూ అతను ట్వీట్‌ చేశాడు. కరోనా ప్రభావం పాకిస్తాన్‌లో తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో అతను తన ఫౌండేషన్‌ ద్వారా పలు సహాయక కార్యక్రమాలు చేపట్టాడు.

దేశంలోని మూలమూలలకు స్వయంగా వెళ్లి పేదలకు ఆహారం, ఇతర వస్తువులు అందజేయడంలో చురుగ్గా పాల్గొన్నాడు. దీని వల్లే అతనికి కరోనా సోకినట్లు సన్నిహితులు చెప్పారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో చేసిన పర్యటనలతో తాము ప్రమాదం ఊహించామని, చివరకు అదే జరిగిందని వారు అన్నారు. 40 ఏళ్ల అఫ్రిది పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైనా అతను క్రికెట్‌లో ఇంకా చురుగ్గానే ఉన్నాడు. మార్చిలో జరిగిన పాకిస్తాన్‌ టి20 సూపర్‌ లీగ్‌లో అతను పాల్గొన్నాడు. 

మరిన్ని వార్తలు