26 ఏళ్ల రికార్డును మిస్‌ చేసుకున్నాడు..

22 Dec, 2019 16:35 IST|Sakshi

కటక్‌: వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ ఒక చారిత్రక రికార్డును మిస్‌ చేసుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెస్టిండీస్‌ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించే రికార్డును షాయ్‌ హోప్‌ స్వల్ప దూరంలో కోల్పోయాడు. విండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా 1993లో 1349 పరుగులు సాధించాడు. అది ఇప్పటివరకూ విండీస్‌ తరఫున వన్డేల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. దాన్ని హోప్‌ జస్ట్‌లో మిస్‌ అయ్యాడు. భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో హోప్‌ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 

ఫలితంగా ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 1345 పరుగులు సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో రోహిత్‌ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. భారత్‌తో రెండో వన్డేలో కోహ్లిని దాటేసిన హోప్‌.. ఓవరాల్‌గా విండీస్‌ తరఫున ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగుల్ని నమోదు చేయడంలో విఫలమయ్యాడు. లారా రికార్డుకు నాలుగు పరుగుల దూరంలో  నిలిచిపోయాడు. విండీస్‌ తరఫున ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో లారా, హోప్‌ల తర్వాత డేస్మాండ్‌ హేన్స్‌(1232పరుగులు-1985లో), వివ్‌ రిచర్డ్స్‌(1231పరుగులు-1985), క్రిస్‌ గేల్‌(1217 పరుగులు- 2006)లు వరుస స్థానాల్లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు