అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో ఆల్‌రౌండర్‌గా..

9 Jun, 2018 15:41 IST|Sakshi

డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఇక్కడ జరిగిన చివరి టీ20లో బంగ్లాదేశ్‌ ఓడిపోవడంతో సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యింది. కాగా, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకిబుల్‌ హసన్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20లో నజీబుల్లా జద్రాన్ వికెట్ తీసిన షకీబుల్..  అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు, 500 వికెట్లు పడగొట్టిన మూడో ఆల్‌రౌండర్‌గా రికార్డు నెలకొల్పాడు.

అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జాక్వస్‌ కల్లిస్‌, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిలు మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. ఈ ఇద్దరి కంటే వేగంగా షకిబుల్‌ ఈ క్లబ్‌ చేరడం విశేషం. దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించిన కలిస్.. 519 మ్యాచ్‌ల్లో 25, 534 పరుగులు, 577 వికెట్లు సాధించాడు. తర్వాతి స్థానంలో ఉన్న షాహిద్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 11,196 పరుగులతో పాటు 541 వికెట్లను సొంతం చేసుకున్నాడు. షకీబుల్ హసన్  302 మ్యాచ్‌ల్లోనే 10,102 పరుగులు చేయడతోపాటు 500 వికెట్ల మార్కును అందుకున్నాడు.

కాగా, భారత్ తరపున కపిల్ దేవ్ మాత్రమే ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు. టీమిండియా చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కపిల్ దేవ్... 356 మ్యాచ్‌ల్లో 9,031 పరుగులు చేయడంతోపాటు 687 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు