డ్రెస్సింగ్‌​ రూమ్‌ విధ్వంసం.. కారకుడు అతనే!

20 Mar, 2018 18:55 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదహస్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్‌ రిఫెరీ క్రిస్‌ బ్రాడ్‌.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు.

అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఆయన ఎటువంటి దాడి జరగలేదని నిర్ధారించారు. అందులో షకీబ్‌ తలుపును బలవంతంగా నెట్టడంతో గదికి ఉన్న అద్దాలు పగిలిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఈ మేరకు క్రిస్‌ బ్రాడ్‌ నివేదికను సిద్ధం చేసినట్లు శ్రీలంక న్యూస్‌ పేపర్‌ ది ఐలాండ్‌ కథనం వెలువరించింది.   

అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్‌ బ్రాడ్‌ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది. ఘటనలో షకీబ్‌పై చర్యలు తీసుకునే అంశంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షకీబ్‌తో పాటు మరో ఆటగాడు నురుల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు