ఆరు నెలలు బ్రేక్ ఇవ్వండి: క్రికెటర్

11 Sep, 2017 15:11 IST|Sakshi
ఆరు నెలలు బ్రేక్ ఇవ్వండి: క్రికెటర్

చిట్టగాంగ్: వరుస మ్యాచ్ లతో పని భారం పెరిగి పోయిన కారణంగా తనకు ఒక ఆరు నెలలు బ్రేక్  కావాలని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ కోరుతున్నారు.  ఈ మేరకు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి షకిబుల్ లేఖ రాశారు. గత కొన్ని నెలలుగా పని ఒత్తిడితో సతమవుతున్న షకిబుల్.. దాన్ని అధిగమించడానికి సుదీర్ఘ విశ్రాంతి ఇవ్వమని  లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ విషయాన్ని బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ జలల్ యూనస్ తాజాగా ధృవీకరించారు. టెస్టు క్రికెట్ నుంచి ఆరు నెలల పాటు   విశ్రాంతి ఇవ్వమని షకిబుల్ అడిగిన విషయం వాస్తవమేనన్నారు. దీన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీరియస్ గా పరిశీలిస్తుందని, షకిబుల్ కు చిన్నపాటి విరామం ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం ఒక ఆటగాడికి ఆరు నెలల విశ్రాంతి అంటే  కష్టమన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి టెస్టును గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పై తొలిసారి టెస్టును గెలుచుకుని బంగ్లాదేశ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ విజయంలో షకిబుల్ హసన్ కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు