‘గెలవకపోవడం సిగ్గుగా ఉంది’

3 May, 2019 16:41 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సూపర్‌ ఓవర్‌లో ఓటమి పాలై ప్లేఆఫ్‌ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇక  మిగిలి ఉన్న ఒక మ్యాచ్‌లో విజయం సాధించినా అది మిగతా జట్ల సమీకరణాల్ని బట్టి సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ముంబైపై సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించకపోవడం చాలా సిగ్గుగా ఉందన్నాడు. సూపర్‌ ఓ‍వర్‌లో తాము ఎనిమిది పరుగులకే పరిమితం కావడంతో జట్టు ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు.

‘ముంబై నిర్దేశించిన లక్ష్య ఛేదనలో మనీశ్‌పాండే అద్భుతంగా ఆడాడు. నబీతో కలిసి దాదాపు విజయతీరాలకు చేర్చాడు. అయితే, నాతో పాటు మిగితా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అతనికి తోడుగా నిలవలేకపోయాం. నబీ ఒక్కడే అతనితోపాటు పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్ల పాండేపై ఎక్కువ భారం పడింది. అయితే, మొదటి పది ఓవర్లు మొత్తం మ్యాచ్‌ మావైపే ఉందనిపించింది. మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. అయితే, సూపర్‌ ఓవర్‌లో మేం కేవలం 8 పరుగులు మాత్రమే చేశాం. అది చాలా చిన్న లక్ష్యం. రషీద్‌ఖాన్‌ ప్రపంచస్థాయి స్పిన్నర్‌. అతను సూపర్‌ ఓవర్‌ వేయగలడని నమ్మాం. అందుకే అతనికి బౌలింగ్‌ ఇచ్చాం. సూపర్‌ ఓవర్‌లో గెలవకపోవడం సిగ్గుగా ఉంది. మిగిలిన  ఉన్న మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: ముంబై మురిసె...)

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సన్‌రైజర్స్‌ ఇప్పటి వరకూ ఆడిన 13 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న మిగిలిన జట్లతో పోల్చుకుంటే సన్‌రైజర్స్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటం కలిసొచ్చే అంశం. అయితే రేసులో ఉన్న కేకేఆర్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్లు ఎలా ఆడతాయి అనే దానిపై సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

మరిన్ని వార్తలు