42 వికెట్లతో ‘టాప్‌’లేపాడు..

22 Dec, 2019 18:26 IST|Sakshi

కటక్‌: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరొకసారి టాప్‌లో నిలిచాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే  వికెట్లు సాధించిన జాబితాలో షమీ అగ్రస్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఈ ఏడాదిని అత్యధిక వన్డే వికెట్లతో ముగించాడు. వెస్టిండీస్‌తో చివరి వన్డేలో షమీ వికెట్‌ సాధించాడు. 2019లో షమీ 21 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును లిఖించుకున్నాడు. ఈ ఏడాది షమీ ఐదు వికెట్లను ఒకసారి సాధించగా, ఒక హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేశాడు. వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్‌ సాధించాడు.

షమీ  తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్య్గుసన్‌లు  ఉన్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ 38 వికెట్లను, ఫెర్గ్యుసన్‌ 35 వికెట్లను సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది భారత్‌కు విండీస్‌ మ్యాచే చివరిది కాగా, కివీస్‌కు సైతం వన్డే మ్యాచ్‌లు లేవు. దాంతో షమీనే టాపర్‌గా ఉంటాడు. కాగా, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో షమీ అత్యధిక వన్డే వికెట్లు సాధించడం ఇది రెండోసారి.

గతంలో 2104లో షమీ తొలిసారి అత్యధిక వన్డే వికెట్లతో టాప్‌  స్థానంలో నిలవగా, ఆ తర్వాత మరొకసారి ఆ ఫీట్‌ సాధించాడు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌(33),  కుల్దీప్‌ యాదవ్‌(32)లు ఐదు, ఆరు  స్థానాల్లో నిలిచారు. యజ్వేంద్ర చహల్‌(29) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో షమీ నాల్గో బౌలర్‌. అంతకుముందు కపిల్‌దేవ్‌(32 వికెట్లు-1986లో), అజిత్‌ అగార్కర్‌ 58 వికెట్లు-1998లో), ఇర్ఫాన్‌  పఠాన్‌((47 వికెట్లు-2004లో)లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు