మరో మలుపు తిరిగిన షమీ వ్యవహారం

9 Mar, 2018 19:19 IST|Sakshi

కోల్‌కతా : టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సాయం తీసుకోవాలని షమీ భార్య హసిన్‌ జహాన్‌ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. 

‘ప్రస్తుతం మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో తేలకపోతే రేపు భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఇది బోర్డు పరిధిలోనే జరిగి ఉంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.  

అయితే బీసీసీఐనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యవహారానికి ముగింపు పలికే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఈ మేరకు జహాన్‌కు రాజీ ప్రతిపాదన పంపిందన్న మరో కథనం వినిపిస్తోంది. మరోవైపు ఈ ఉదయం షమీపై కోల్‌కతా లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన సంగతి తెలిసిందే. గృహ హింసా చట్టం కింద కేసు నమోదుకాగా.. భార్య జహాన్‌ను వేధించటం.. రేప్‌ అటెంప్ట్‌.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు