ట్యాంపరింగ్‌: తొలిసారి స్పందించిన వార్న్‌

28 Mar, 2018 20:36 IST|Sakshi
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ (ఫైల్‌ ఫోటో)

సిడ్నీ: ట్యాంపరింగ్‌ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది పాటునిషేదం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సీఏ విధించి శిక్షపై ఆదేశ దిగ్గజ మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి సిగ్గుమాలిన సంఘటన ఎప్పుడూ చూడలేదని,  క్షమించలేని తప్పును ఆసీస్‌ ఆటగాళ్లు చేసారని వార్న్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో బాల్‌ ట్యాంపరింగ్‌ను చాలా మంది ఆటగాళ్లు ఆవేశపూరితంగా చేశారని, కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక వస్తువు తెచ్చుకొని ట్యాంపరింగ్‌ చేయడం తానెప్పుడు చూడలేదన్నాడు. ఇది ఓ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.  ఈ చర్యతో దేశ పరువు తీయడమే కాకుండా ఆసీస్‌ అభిమానులకు అపత్రిష్ట తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి ఆడినా ప్రతీ మ్యాచ్‌ను గెలవలేమని, ఓటమి ఆటలో ఒక భాగమే అనే విషయాన్ని ఆటగాళ్లు గుర్తించాలని ఈ మాజీ క్రికెటర్‌ సూచించారు. అసలు కేప్‌టౌన్‌లో ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆటగాళ్లకు వార్న్‌ హితబోద చేశారు. 

స్మిత్‌, వార్నర్‌ల నిషేధంతో నవంబర్‌లో భారత్‌తో జరిగే కీలక సిరీస్‌కు దూరం కావడం ఇబ్బంది కలిగించే విషయం అని, కానీ వరల్డ్‌ కప్‌కు అందుబాటులో ఉండటం సంతోషం అని వార్న్‌ పేర్కొన్నారు. ఏడాది నిషేదం తరువాత వచ్చే ఆటగాళ్లను స్వాగతించాలని అభిమానులకు వార్న్‌ విజ్ఞప్తి చేశారు. యువ ఆటగాళ్లు ఇదొక గుణపాఠంగా భావించాలని హితవు పలికారు.    

మరిన్ని వార్తలు