‘ఇక చాలు.. అది ధోనికి తెలుసు’

28 May, 2019 11:07 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌

సిడ్నీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. భారత క్రికెట్‌కు ధోని ఎన్నో సేవలు చేశాడని చెప్పుకొచ్చాడు. ‘భారత క్రికెట్‌కు ధోని అద్బుతమైన సేవకుడు. భారత క్రికెట్‌కు కావాల్సిన ప్రతి ఒక్కటి అతను అందజేశాడు. కానీ కొంతమంది అదేపనిగా ధోనిపై విమర్శలు చేయడం, ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయవద్దని వ్యాఖ్యానించడం నాకు అర్థం కావడం లేదు. అసలు ధోని ఎందుకు రిటైర్‌ కావాలో విమర్శకులు చెప్పాలి. ఒక ఆటగాడికి ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో అనేది అతనికి తెలుసుంటుంది. ధోని కూడా అంతే. అయితే ధోని రిటైర్మెంట్‌ ప్రపంచకప్‌ అనంతరమా? లేక మరో ఐదేళ్ల తర్వాతా? అనేది పూర్తిగా అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అతనికి కావాల్సింది సాధించే వరకు ధోని రిటైర్‌ అవ్వడు’ అని షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు.

ధోని తన సారథ్యంలో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు అందజేసిన విషయం తెలిసిందే. ఇక గతేడాదిగా ధోని కూడా అద్భుతమై ఫామ్‌లో ఉ‍న్నాడు. 2018లో 9 మ్యాచ్‌లు ఆడిన ధోని 81.75 సగటుతో 327 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బ్యాటింగ్‌, కీపింగ్‌, కెప్టెన్సీతో అదరగొట్టాడు. 12 ఇన్నింగ్స్‌లు ఆడి 83.20 సగటుతో 416 పరుగుల చేశాడు. ఇక రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ పోరులో ధోని సూచనలు, అతని కీపింగ్‌ కోహ్లిసేన​​కు ఉపయోగపడనున్నాయి.


 

మరిన్ని వార్తలు