‘గంగూలీ కోసం లక్ష్మణ్‌ను తప్పించాను’

1 Apr, 2020 17:40 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను తెరదీశాడు. తను క్రికెట్‌ ఆడిన కాలంలోని 11 మంది ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ భారత జట్టును షేన్‌ వార్న్‌ ప్రకటించాడు. ఈ జట్టుకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగిన సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు వార్న్‌ తన జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై వివరణ ఇచ్చిన వార్న్‌ జట్టు కూర్పులో భాగంగానే లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదని తెలిపాడు. 

అంతేకాకుండా సారథి గంగూలీ కోసమే లక్ష్మణ్‌ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని సరదాగా పేర్కొన్నాడు. తను ఎంపిక చేసిన 11 మందిలో సారథిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక లక్ష్మణ్‌ను తప్పించి గంగూలీని జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాడు. అయితే కపిల్‌ దేవ్‌, అజహరుద్దీన్‌లను ఎంపిక చేసినప్పటికీ వారికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడానికి వార్న్‌ అనాసక్తి కనబర్చడం విశేషం. ఇక ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిలతో తను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడంతో వారిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. 

ఓపెనర్లుగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, వీరేంద్ర సెహ్వాగ్‌లవైపే వార్న్‌ మొగ్గు చూపాడు. స్పిన్‌ బౌలింగ్‌లో ముఖ్యంగా తన బౌలింగ్‌లో ఏమాత్రం ఇబ్బంది పడని సిద్దూను ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపిన అతడు.. సచిన్‌, ద్రవిడ్‌లు లేకుండా అత్యుత్తమ భారత జట్టును ఎంపిక చేయడం కష్టం అని పేర్కొన్నాడు. ఇక తన స్పిన్‌తో ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్‌కు భారత్‌పై మాత్రం మెరుగైన రికార్డు లేకపోవడం విడ్డూరం. టీమిండియాతో జరిగిన 24 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 43 వికెట్లను మాత్రమే పడగొట్టాడు.  

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌,  మహ్మద్‌ అజహరుద్దీన్‌, నయాన్‌ మోంగియా, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌

చదవండి:
ఆసీస్‌ బెదిరిపోయిన వేళ..
సిలిండర్‌ పేలి క్రికెటర్‌ భార్యకు గాయాలు

మరిన్ని వార్తలు