'ఆరోజు పాంటింగ్‌ చెత్త నిర్ణయం తీసుకున్నాడు'

13 May, 2020 09:15 IST|Sakshi

సిడ్నీ : క్రికెట్‌లో దాయాదుల పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఉదాహరణకు  భారత్‌- పాకిస్తాన్‌ తలపడ్డాయంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనలే యాషెస్‌ సిరీస్‌లోనూ చోటుచేసుకుంటుంది.  ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ను ఇరు దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి.  టెస్ట్‌ మ్యాచ్‌లు అంటేనే బోర్‌గా ఫీలయ్యే ఈ రోజుల్లో కూడా  యాషెస్ సిరీస్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఎందుకంటే యాషెస్‌ అనగానే ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడడంతో సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. దీనికి తోడు ఆటగాళ్ల స్లెడ్జింగ్ అభిమానులకు కావాల్సిన మజానిస్తుంది.  అందులో 2005 ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ఒకటి. ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు ఊరించిన విజయం ఇంగ్లండ్‌ను వరించింది. ఆ జట్టు అనూహ్యంగా 2 పరుగులతో విజయాన్నందుకుంది.
('ఆ విషయంలో సచిన్‌ కంటే కోహ్లి ముందుంటాడు')

అయితే ఈ మ్యాచ్‌లో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే తమ కొంప ముంచిందని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వార్న్ తెలిపాడు. పాంటింగ్ కెప్టెన్సీలోనే ఇది అత్యంత చెత్త నిర్ణయమని విమర్శించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఆ వికెట్‌పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్.. ఎంచుకోవడమే అతను చేసిన పెద్దతప్పుగా చెప్పుకొచ్చాడు. ‘ఓ కెప్టెన్‌గా పంటర్ తీసుకున్న ఆ నిర్ణయం అత్యంత చెత్తది. అతని నిర్ణయం ఇంగ్లండ్‌కు మేలు చేసింది. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ పోరాడిన తీరు అద్భుతం. బ్రెట్‌లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ దాదాపు తమ విజయాన్ని ఖాయం చేసినా ఇంగ్లండ్ పట్టువదల్లేదు. ఆ మ్యాచ్‌లో నేను హిట్ వికెట్ అయిన తీరు ఇప్పటికీ అంతుపట్టడం లేదు.


ఆ రాత్రి ముందు చివరి ఓవర్‌లో స్టీవ్ హర్మిసన్ స్లోయర్ బంతితో మైకెల్ క్లార్క్‌ను బౌల్ట్ చేశాడు. అప్పటికి మా విజయానికి 107 పరుగులు కావాలి. బ్రెట్ లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ ఉండటంతో మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకున్నా. కానీ ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో 90 మైళ్ల వేగంతో బంతులు విసిరి ఫలితాన్ని రాబట్టారు. హార్మీసన్, ఫ్లింటాఫ్ సూపర్బ్‌గా బౌలింగ్ చేశారు. నా బ్యాటింగ్ సమయంలో ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ నా కాలు స్టంప్స్ తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగా. దీంతో నేను హిట్ వికెట్ అవ్వడం ఇప్పటికీ మరిచిపోలేదంటూ' షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు.
('జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా')

కాగా  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 రన్స్ చేసింది. అనంతరం ఆసీస్ 308 పరుగులు చేసి 99 రన్స్ వెనుకబడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 182 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ముందు 282 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ టార్గెట్‌ చేజింగ్‌లో తడబడిన ఆసీస్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పుతూ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. బ్రెట్‌లీ(43 నాటౌట్)తో కలిసి షేన్ వార్న్(42) విజయం దిశగా నడిపించారు. కానీ వార్నర్ హిట్ వికెట్ అవ్వగా.. చివరి బ్యాట్స్‌మన్‌ను హర్మిసన్ ఔట్ చేశాడు. దీంతో రెండు పరుగుల దూరంలో ఆసీస్ ఓటమికి తలవంచింది.

మరిన్ని వార్తలు