రక్తంతో తడిసిన వాట్సన్‌ మోకాలిని చూశారా?

14 May, 2019 11:47 IST|Sakshi

అదీ వాట్సన్‌ అంటే..

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వీరోచితంగా బ్యాటింగ్‌ చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చి.. చివరలో రన్నౌట్‌ అయిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌ గురించి ఆ జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మోకాలికి దెబ్బతగిలి.. రక్తం కారుతున్నా.. ఆ గాయం తాలుకూ బాధ సలుపుతున్నా.. ఏమాత్రం చెక్కుచెదరకుండా షేన్‌ వాట్సన్‌ చివరివరకు బ్యాటింగ్‌ చేశాడని హర్భజన్‌ వెల్లడించాడు. ఎడమ మోకాలు వద్ద రక్తంతో వాట్సన్‌ ప్యాంటు తడిసిపోయిన  ఫొటోను భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

‘గాయ్స్‌.. రక్తంతో తడిసిన అతని మోకాలిని చూశారా? మ్యాచ్‌ తర్వాత అతని గాయానికి ఆరు కుట్లు వేశారు. మ్యాచ్‌ డైవింగ్‌ సందర్భంగా వాట్సన్‌ గాయపడ్డాడు. అయినా ఎవరికీ చెప్పకుండా అతను వీరోచితంగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. వాట్సన్‌ అంటే అది. అతను దాదాపుగా మమ్నల్ని విజయం ముంగిటికి తీసుకొచ్చాడు’ అని భజ్జీ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌ విసిరిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఒంటరిపోరాటం చేసిన వాట్సన్‌.. 59 బంతుల్లో 80 పరుగులు చేసి.. చివరిఓవర్‌లో రన్నౌట్‌ అయిన సంగతి తెలిసిందే. వాట్సన్‌ రన్నౌట్‌తో గట్టి షాక్‌కు గురైన చెన్నై జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఈ మ్యాచ్‌లో ఓడి.. ఐపీఎల్‌ కప్‌ కోల్పోయింది. వాట్సన్‌ వీరోచిత ఇన్సింగ్స్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. డైవింగ్‌లో గాయపడి.. మోకాలు రక్తపుమయంగా మారిన ఏమాత్రం బెదరకుండా బ్యాటింగ్‌ కొనసాగించిన వాట్సన్‌ను హీరో ఆఫ్‌ ది మ్యాచ్‌గా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు