దుమ్మురేపిన వాట్సన్

22 Aug, 2013 01:31 IST|Sakshi
దుమ్మురేపిన వాట్సన్

లండన్: ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ (247 బంతుల్లో 176; 25 ఫోర్లు, 1 సిక్సర్) ఎట్టకేలకు యాషెస్ సిరీస్‌లో గాడిలో పడ్డాడు. ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో శతకంతో చెలరేగాడు. ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఒంటిచేత్తో జట్టును గట్టెక్కించాడు.
 
  స్మిత్ (133 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) కూడా తన వంతు పాత్రను సమర్థంగా పోషించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. స్మిత్‌తో పాటు సిడిల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 0-3తో సిరీస్‌ను కోల్పోయిన క్లార్క్‌సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో జట్టులో స్వల్ప మార్పులు చేసింది. జేమ్స్ ఫాల్క్‌నర్ టెస్టుల్లో అరంగేట్రం చేయగా... పేసర్ మిచెల్ స్టార్క్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఓపెనర్ వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. రోజర్స్ (23) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వన్‌డౌన్‌లో వచ్చిన వాట్సన్‌కు చక్కని సహకారం అందించాడు. ఇంగ్లండ్ పేస్ అటాకింగ్‌కు ఏమాత్రం తడబడకుండా వాట్సన్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో ఎండ్‌లో రోజర్స్ మెల్లగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. రెండో వికెట్‌కు వీరిద్దరి మధ్య 107 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత స్పిన్నర్ స్వాన్... రోజర్స్‌ను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ క్లార్క్ (7) కుదురుకోవడానికి సమయం తీసుకున్నా విఫలమయ్యాడు.
 
 అండర్సన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ 144 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ ఆకట్టుకున్నాడు. వాట్సన్‌తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో వాట్సన్ 114 బంతుల్లో కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 145 పరుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే మరో మూడు ఓవర్లలో రోజు ముగుస్తుందనగా బ్రాడ్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ వెనుదిరిగాడు. అండర్సన్ 2, బ్రాడ్, స్వాన్ చెరో వికెట్ పడగొట్టారు.
 

మరిన్ని వార్తలు