‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!

19 Jun, 2020 11:31 IST|Sakshi

సౌతాంప్టన్‌: త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌కు సంబంధించి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేవని వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెనాల్‌ గాబ్రియెల్‌ పేర్కొన్నాడు.  ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనకు ఆడే అవకాశం వస్తే పరిస్థితుల్నే బట్టి ప్రణాళికలు ఉంటాయన్నాడు. ఇక గతేడాది ఇంగ్లండ్‌తో సెయింట్‌ లూసియాలో జరిగిన మూడో టెస్టులో జోరూట్‌ను స్లెడ్జ్‌ చేసిన గాబ్రియెల్‌ నాలుగు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా?’ అంటూ కామెంట్‌ చేసి నిషేధం బారిన పడ్డాడు. దీనిపై అప్పట్లో రూట్‌ కూడా గాబ్రియెల్‌కు తిరిగి కౌంటర్‌ ఇచ్చాడు. ‘గే గా ఉండటంలో తప్పులేదు కదా.. మీ దేశంలో గే సెక్స్‌ నేరం కావొచ్చు’ అని పేర్కొన్నాడు. (2011 ఫైనల్‌ ఫిక్సయింది!)

తాజాగా ఆ వివాదంపై గాబ్రియెల్‌ను కాన‍్ఫరెన్స్‌లో రిపోర్టర్లు అడగ్గా, అందుకు సమాధానం ఇస్తూ..‘ అది ముగిసిన వివాదం. దాన్ని పెద్దదిగా చూడటం లేదు. దాన్ని మరచిపోవాలనుకుంటున్నా. అదే సమయంలో మరొకసారి ఆ తరహా కామెంట్లు చేసే ఉద్దేశం కూడా లేదు. అది వ్యక్తిగత పరిహాసం. మీరు ఆట యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉన్నంత వరకూ కొంచె వ్యక్తిగత పరిహాసం కూడా ఉంటుంది. అప్పుడు చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేందుకు చేసినవి కావు. ఆటలో కాస్త పరిహాసం కూడా ఉంటుంది. ఈ విషయంలో పెద్దగా మార్పు వస్తుందని అనుకోను.

నాకు రూట్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు. ఇంగ్లండ్‌ జట్టు మొత్తం టార్గెట్‌. నాకు ఆడే అవకాశం వస్తే రూట్‌, స్టోక్స్‌ ఇలా ఎవరో ఒకర్ని  లక్ష్యంగా చేసుకోకూడదు. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. నా పూర్తిస్థాయి ప్రదర్శనతో వారిని కట్టడి చేస్తా’ అని తెలిపాడు. ఇప్పటివరకూ 45 టెస్టులు ఆడిన గాబ్రియెల్‌.. వంద శాతం ప్రదర్శన చేయకపోతే ఎవరినైనా కట్టడి చేయడం కష్టమేనన్నాడు. ఇక గతేడాది కరీబియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ప్రణాళికలే ఇక్కడ కూడా ఉంటాయన్నాడు. అందులో పెద్దగా మార్పులు ఉంటాయని అనుకోవడం లేదన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై8 వ తేదీ నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరుగనుంది.(రోహిత్‌ నా రోల్‌ మోడల్‌: పాక్‌ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు