సెమీస్‌లో షరపోవా

4 Jun, 2014 01:22 IST|Sakshi
సెమీస్‌లో షరపోవా

బౌచర్డ్ కూడా...   
 ఫ్రెంచ్ ఓపెన్
 పురుషుల్లో జొకోవిచ్,
 గుల్బిస్ ముందంజ
 
 పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా అందాల తార మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 1-6, 7-5, 6-1తో ప్రపంచ 35వ ర్యాంకర్, అన్‌సీడ్ గార్బిని ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లోకి ప్రవేశించింది. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ నిలకడను ప్రదర్శించింది.
 
  ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ 0-4తో వెనుకబడి తొలిసెట్‌ను చేజార్చుకున్నా... చివరి రెండు సెట్లలో కచ్చితమైన సర్వీస్‌లు, పదునైన షాట్లతో చెలరేగింది. చివరి 10 గేమ్‌ల్లో 9 గెలుచుకుంది. మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ మ్యాచ్ ఆడుతున్న ముగురుజా ప్రారంభంలో మెరుగైన షాట్లతో అలరించింది. మరో క్వార్టర్స్‌లో 18వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (4), 2-6, 7-5తో 14వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై నెగ్గింది.
 
 బెర్డిచ్‌కు షాక్: పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)కు నిరాశ ఎదురైంది. 18వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) 6-3, 6-2, 6-4తో బెర్డిచ్‌పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-5, 7-6 (7/5), 6-4తో ఎనిమిదో సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా)పై నెగ్గాడు.
 
 సానియా జోడి పరాజయం: మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి చుక్కెదురైంది. క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్ సానియా ద్వయం 2-6, 6-3, 3-6తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ సూ వీ సెయి (చైనీస్‌తైపీ)-షుయె పెంగ్ (చైనా)ల చేతిలో ఓడింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-బ్లాక్ ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఐదుసార్లు సర్వీస్‌ను కోల్పోయింది. సానియా జోడి ఓటమితో రోలాండ్ గారోస్‌లో భారత పోరు ముగిసింది.
 

మరిన్ని వార్తలు