నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ

29 Oct, 2019 13:28 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆ దేశ యాంటీ కరప్షన్‌ యూనిట్‌(అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్‌ లభించడంతో అతను ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. ఈ మేరకు  ఇటీవల పీసీబీ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ ముందు హాజరైన షార్జిల్‌ ఖాన్‌కు దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది. దాంతో త్వరలో ఆరంభం కానున్న పీఎస్‌ఎల్‌లో షార్జిల్‌ ఆడనున్నాడు. పీఎస్‌ఎల్‌ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో షార్జిల్‌ చేరబోతున్నాడు.

పాకిస్తాన్‌ తరఫున 25 వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన షార్జిల్‌.. పీఎస్‌ఎల్‌ రెండో ఎడిషన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో  2017, ఆగస్టులో అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. కాగా, తనను క్షమించాలంటూ పీసీబీకి షార్జిల్‌ విన్నవించుకోవడంతో అతనిపై ఉన్న నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు. దాంతో షార్జిల్‌పై నిషేధం ముగిసింది. దాంతో షార్జిల్‌ తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, ఖలీద్‌ లతీఫ్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, మహ్మద్‌ నవాజ్‌, నసీర్‌ జెంషెడ్‌, షహ్‌జైబ్‌ హసన్‌లు ఇంకా నిషేధం ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు