నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

20 Aug, 2019 11:22 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్‌ షార్జీల్‌ఖాన్‌ తిరిగి తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. సోమవారం పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులను షార్జీల్‌ కలిసి విజ్ఞప్తి చేశాడు. బోర్డు విధించిన నిషేధం గడువు ముగియడంతో తిరిగి కెరీర్‌ను కొనసాగించేందుకు అతడికి అనుమతి లభించింది. ‘నా వల్ల ఇబ్బంది పడ్డ పీసీబీకి, సహచరులకు, అభిమానులకు, కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఇప్పటి నుంచి బాధ్యతాయుతంగా ఉండి భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తానని హమీ ఇస్తున్నా’ అంటూ పీసీబీ విడుదల చేసిన లేఖలో షార్జీల్‌ పేర్కొన్నాడు. 

అతడికి విధించిన నిషేధం రెండున్నరేళ్ల గడువు ముగిసినందున తిరిగి రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడని, ఈ ఏడాది పూర్తయ్యేలోపు షార్జీల్‌ తన శిక్షణను పూర్తి చేసుకుంటాడని పీసీబీ ప్రకటించింది. ఆ తర్వాత జాతీయ జట్టులో చేరతాడని చెప్పింది. 2017లో దుబాయ్‌లో నిర్వహించిన పీఎస్‌ఎల్‌ రెండో సీజన్‌లో షార్జీల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన పాక్‌ బోర్డు. తర్వాత దాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. ఇటీవల ఆ గడువు పూర్తవడంతో తిరిగి తన కెరీర్‌ కొనసాగించేందుకు అవకాశమిచ్చింది. 

మరిన్ని వార్తలు