శశాంక్‌ పదవీ కాలం పొడిగింపు..!

24 Apr, 2020 16:49 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా రెండు పర్యాయాలు ఏకగీవ్రంగా ఎన్నికైన శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉంది. శశాంక్‌ పదవీ కాలం మే నెల వరకే ఉండగా దాన్ని అదనంగా మరో రెండు నెలలకు పెంచాలనే యోచనలో ఉన్నారు.. కరోనా వైరస్‌ కారణంగా ఐసీసీ బోర్డు మీటింగ్‌ వాయిదా పడటంతో మనోహర్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో జూన్‌ చివరి వారంలో మనోహర్‌ చైర్మన్‌ కొనసాగే అవకాశం ఉంది. జూలై-ఆగస్టుల్లో ఐసీసీకి కొత్త బాస్‌ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ శశాంక్‌ పదవీ కాలాన్ని పొడిగించడానికే మొగ్గుచూపుతున్నారు.ఈ రేసులో ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ముందంజలో ఉన్నారు. 

దిగే వరకూ నమ్మలేం..
అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసీసీ స్వతంత్ర  చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్‌..  ఆ పదవి నుంచి దిగే వరకూ నమ్మలేమని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. శశాంక్‌ రాజీనామా చేయడం మనం చూసి, అతని దిగిపోవడాన్ని చూసిన తర్వాతే ఒక అంచనాకు రావాలన్నాడు.  శశాంక్‌కు ఇంకా ఒక పర్యాయం  మిగిలి ఉంది. ఒకవేళ మనోహర్‌కు ఇంకా చేయాలని చివరి నిమిషంలో కోరిక పుడితే.. మళ్లీ అతనే కొనసాగుతాడన్నాడు. అప్పుడు ఆ కథే వేరుగా ఉంటుందని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. (నన్ను మీ నాన్న అన్న మాటలే.. నీకు ఇచ్చేశా!)

2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌ పదవిని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు రెండు పర్యాయాలు శశాంక్‌ మనోహరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు కత్తెర వేశారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్‌ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని శశాంక్‌ మనోహర్‌ సమూలంగా మార్చివేశారు. 

బీసీసీఐతో పాటు క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను రద్దుచేశారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దుచేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను కూడా భారీగా తగ్గించారు. దీంతో అప్పటివరకు ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించిన బీసీసీఐని ఏకాకి చేయడంలో శశాంక్‌ మనోహర్‌ కీలకపాత్ర పోషించారు. శశాంక్‌ మనోహర్‌ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టడం ప్రారంభించాయి. 

మరిన్ని వార్తలు